విమానాలు పై నుంచి దిగడం చూసివుంటాం. కానీ మనషులపైకి వచ్చేంత రీతిలో వచ్చి విమానం కిందకు దిగడం మనం చూశామా. ఇది కాస్త ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. మామూలుగా విమానం అంటేనే చాలా మంది ఇష్టం. పైన ఎక్కడో ఆకాశంలో ప్రయాణిస్తుంటేనే ఆసక్తిగా చూస్తుంటాం. నిజం చెప్పాలంటే మనలో చాలా మంది ఒక్కసారి విమానం ఎక్కనివారే. కనీసం దగ్గరి నుంచి చూడనివారూ ఎంతో మంది. ఇది ఎలా ఉన్నా గాల్లో ఎగురుతున్న విమానాన్ని చాలా దగ్గరి నుంచి.. అదీ మనం చెయ్యి పైకి ఎత్తితే తగులుతుందేమో అన్నంత కింది నుంచి చూస్తే ఎలా ఉంటుంది. ఓ వైపు భయం కలిగించినా.. మరోవైపు ఆ ఉత్కంఠే వేరు అనిపిస్తుంటుంది. గ్రీస్‌లోని స్కియతోస్ ద్వీపానికి వెళితే మాత్రం ఈ అనుభూతిని స్వయంగా పొందవచ్చు.
స్కియతోస్ ద్వీపంలోని ఎయిర్ పోర్టుకు సరైన స్థలం లేదు. బీచ్ సమీపంలో ఉన్న చదునైన స్థలంలోనే ఎయిర్ పోర్టును నిర్మించారు. కానీ దాని రన్ వే కేవలం ఒకటిన్నర కిలోమీటర్లే. అందువల్ల చాలా ముందుకు వచ్చి దిగడానికీ వీలుండదు. బీచ్ కు పక్కనే మొదలయ్యే.. రన్ వే ప్రారంభంలోనే విమానాలు ల్యాండ్ కావాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ సాధారణమే కూడా. విమానాలు నేరుగా మన తలపై నుంచి ముందుకెళ్లి కొద్ది మీటర్ల దూరంలో ఉన్న రన్ వేపై ల్యాండ్ అవుతూ ఉంటాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.
విమానాలు బాగా కిందుగా వచ్చి ల్యాండ్ అవడం మామూలే అయినా.. ఆగస్టు 5న మాత్రం విజ్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం అత్యంత దిగువగా వచ్చింది. రన్ వే ప్రారంభంలో ఉన్న ప్రహరీ గోడకు కేవలం కొన్ని అంగుళాలపై నుంచి దూసుకెళ్లి.. రన్ వేపై దిగింది. ఆ సమయంలో బీచ్ లో ఉన్న పర్యాటకులకు ఒక్కసారిగా గుండె ఝల్లుమంది. ఒకరిద్దరు భయంతో పరుగు అందుకుంటే.. మరికొందరు తలకు తగులుతుందేమో అనిపించి కిందికి వంగారు. రన్ వేపై విమానం దిగినప్పుడు.. దాని ఇంజన్ల నుంచి అతి వేగంగా వచ్చే గాలి ధాటికి కొందరు కిందపడిపోయారు కూడా. దీనికి సంబంధించి కొందరు ప్రయాణికులు దూరం దూరంగా, వేర్వేరుగా తీసిన వీడియోలను కలిపి ఓ వీడియోను విడుదల చేశారు. ఇది ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. నిజానికి ఇక్కడ విమానాల ఇంజన్ల నుంచి వెలువడే గాలి ధాటికి ఎగిరిపడినవారు, గాయాల పాలైనవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అయినా సందర్శకుల తాకిడి మాత్రం తగ్గడం లేదని స్థానికులు చెబుతున్నారు.