సాంకేతిక కారణాలు కూడా ఒక్కోసారి విమానాల ప్రయాణాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ కారణం చేతనే తాజాగా బెంగళూరు నుంచి మాల్దీవుల్లోని మాలేకు వెళ్తున్న గో ఫస్ట్ విమానం కోయంబత్తూరులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అలారంలో లోపం కారణంగా ఈ సమస్య తలెత్తింది. ఆ ఫ్లైట్‌లో 92 మంది ప్రయాణికులు ఉన్నారు. తమిళనాడులోని టెక్స్‌టైల్ సిటీ మీదుగా గగనతలంలో ఎగురుతున్న సమయంలో అలారం మోగింది. దాంతో పైలట్ అప్రమత్తమయ్యాడు. ప్రమాద సంకేతంగా భావించి.. వెంటనే విమానాన్ని ల్యాండ్ చేశారు. అయితే కోయంబత్తూరులోని విమానాశ్రయ అధికారులు మాత్రం ఇది తప్పుడు హెచ్చరిక అని, అలారంలో ఏదో లోపం ఉండడం వల్లే ఇది జరిగిందని వెల్లడించారు.
అలారం తప్పుగా మోగడంతో విమానం కోయంబత్తూర్ ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం మధ్యాహ్నం 12.57 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయింది. వెంటనే ప్రయాణికులను కిందకు దింపేసి విమానాన్ని అధికారులు పరీక్షించారు. ఇంజన్లను చెక్ చేసి.. విమానంలో ఎటువంటి లోపం లేదని నిర్ధారణ చేసుకున్నారు. అయితే అలారంలోనే లోపం ఉందని ఇంజనీర్లు గుర్తించారు. విమానం ప్రయాణించేందుకు అనువుగా ఉందని ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మిగతా అన్ని ప్రమాణాలను అనుసరించి సాయంత్రం ఐదు గంటల తర్వాత విమానం మాలేకి బయలుదేరింది.
ఇదిలావుంటే గత నెలలో ఎన్నో విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భారత క్యారియర్‌ల చీఫ్‌లతో సమావేశం నిర్వహించారు. భద్రతా పర్యవేక్షణను పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సింధియా ఆదేశించారు. గత వారం గో ఫస్ట్ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే పక్షి దాడికి గురై అహ్మదాబాద్‌కు తిరిగి వచ్చింది. జూన్ 20న స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఢిల్లీకి వెళ్లే విమానం పాట్నా విమానాశ్రయం నుంచి బయలుదేరిన వెంటనే మంటల్లో చిక్కుకుంది. దాంతో అత్యవసరంగా ల్యాండ్చేశారు. అదే రోజు ఢిల్లీకి వెళ్లే మరో ఇండిగో విమానం టేకాఫ్ తర్వాత పక్షి ఢీకొనడంతో గౌహతి విమానాశ్రయానికి తిరిగి వచ్చింది.