ఎవరూ ఊహించని రీతిలో ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై అకస్మాత్తుగా దాడి జరిగింది. అమెరికా పర్యటనలో ఉన్న రష్దీ శుక్రవారం (ఆగస్టు 12) న్యూయార్క్ పశ్చిమ ప్రాంతంలోని చౌతౌక్యూ విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించేందుకు వచ్చారు. ప్రసంగం ఇచ్చేందుకు స్టేజీపైకి వచ్చిన సల్మాన్ రష్దీ.. తనను తాను పరిచయం చేసుకోగానే.. వీక్షకుల్లోంచి ఓ వ్యక్తి అకస్మాత్తుగా స్టేజీపైకి దూసుకొచ్చాడు. సల్మాన్ రష్దీని కిందపడేసి పిడిగుద్దుల వర్షం కురిపించాడు. కత్తితోనూ దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వెంటనే కొంత మంది అక్కడికి పరుగెత్తుకొచ్చి దాడి చేసిన వ్యక్తిని పక్కకు ఈడ్చేసి సల్మాన్ రష్దీని రక్షించారు. ఆయణ్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
1980వ దశకంలో సల్మాన్ రష్దీ రాసిన ‘ది సెటానిక్ వెర్సెస్’ పుస్తకం ఇస్లామిక్ దేశాల్లో దుమారం రేపింది. ఈ పుస్తకంలో ముస్లింల దైవాన్ని దూషించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో 1988 నుంచి ఇరాన్ ఈ పుస్తకంపై నిషేధం విధించింది. ఆ మరుసటి సంవత్సరమే నాటి ఇరాన్ నాయకుడు అయతొల్లాహ్ రుహొల్లాహ్ ఖొమైనీ సంచలన ప్రకటన చేశారు. సల్మాన్ రష్దీని హత్య చేయాలంటూ ఫత్వా జారీ చేశారు. రష్దీని చంపిన వాళ్లకు 3 మిలియన్ డాలర్లు ఇస్తామని ప్రకటించారు.