సైబర్ అకతాయిలు ప్రముఖులను వేధించడం సర్వసాధారణంగా మారింది. తాజాగా హైదరాబాదుకు చెందిన అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ కు ఆన్ లైన్ లో వేధింపులు ఎదురయ్యాయి. దీనిపై నైనా జైశ్వాల్ తండ్రి పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ గజరావు భూపతి దీనిపై స్పందిస్తూ, సదరు యువ క్రీడాకారిణికి ఓ గుర్తుతెలియని వ్యక్తి వాట్సాప్ లో అభ్యంతరకర రీతిలో సందేశాలు పంపుతున్నాడని తెలిపారు. ఇది ఐటీ చట్టాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. హైదరాబాదులోని కాచిగూడలో నివసించే నైనా జైస్వాల్ టేబుల్ టెన్నిస్ లో అంతర్జాతీయంగా అనేక విజయాలు సాధించింది. ఆమెకు సోషల్ మీడియాలో ఇంతకుముందు కూడా ఇలాగే వేధింపులు ఎదురైనట్టు తెలుస్తోంది.