ఆహారంలో భాగంగా తీసుకునే వాణిజ్య ఉప్పు మోతాదు మించితే ఎన్నో అనర్థాలు ఎదుర్కోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారంలో సోడియం ఎక్కువ, పొటాషియం తక్కువగా ఉంటే.. అది రక్తపోటు పెరిగేందుకు దారితీస్తుంది. దీని కారణంగా గుండె జబ్బులు వస్తాయి. అందుకని సోడియం తగ్గించి తీసుకోవడం మంచిది. ఆహారంలో భాగంగా తీసుకునే వాణిజ్య ఉప్పు మోతాదు మించితే ఎన్నో అనర్థాలు ఎదుర్కోవాల్సిందే. ఈ ఉప్పుకు ప్రత్యామ్నాయలు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, మరణ ప్రమాదం తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో పరిశోధకులు తెలుసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సోడియం ఎక్కువగా ఉండే ఉప్పుకు ప్రత్యామ్నాయాలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా అధిక మరణాలకు గుండె జబ్బులు కారణమవుతుంటే.. చిన్న వయసులోనే మరణాలకు రక్తపోటు కారణంగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా 128 కోట్ల మంది రక్తపోటుతో బాధపడుతున్నారని అంచనా. కానీ, వీరిలో సగం కేసులే గుర్తించినవి ఉన్నాయి. ఉప్పుకు ప్రత్యామ్నాయాలలో సోడియం క్లోరైడ్ తక్కువగాను, పొటాషియం క్లోరైడ్ ఎక్కువగా ఉంటుంది. కనుక రక్తపోటు నియంత్రణకు సాయపడుతుంది. బీఎంజే జర్నల్ హర్ట్ అనే పత్రికలో తాజా అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి.
అంతర్జాతీయంగా 30,000 మంది భాగస్వామ్యంతో 21 అంతర్జాతీయ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఉప్పు ప్రత్యామ్నాయాలలో సోడియం 33-75 శాతం మధ్య.. పొటాషియం 25-65 శాతం మధ్య ఉంటున్నాయి. ప్రత్యామ్నాయాలలో ఒకదాన్ని తీసుకోవడం వల్ల.. సిస్టాలిక్ రక్తపోటు 4.61 ఎంఎం హెచ్ జీ వరకు, డయాస్టాలిక్ 1.61 ఎంఎం హెచ్ జీ తగ్గుతున్నట్టు గుర్తించారు. సంప్రదాయ ఉప్పుతో పోలిస్తే ప్రతి 10 శాతం మేర సోడియం తగ్గించుకుంటే 1.53 ఎంఎం హెచ్ జీ మేర సిస్టాలిక్ రక్తపోటు తగ్గుతుంది. కనుక ఉప్పు ప్రత్యామ్నాయాలు లేదంటే సంప్రదాయ ఉప్పునే చాలా వరకు తగ్గించి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.