త్రివర్ణ పతాకాలను ఎగురవేయని ఇళ్లను ఫోటో తీయాలంటూ ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్ మహేంద్ర భట్ డిమాండ్ చేశారు. అయితే సర్వత్రా విమర్శలు రావడంతో ఆయన ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను అనలేదన్నారు. ఇదిలావుంటే స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రతి ఇంట జెండా ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అయితే దీనిపై ఓ బీజేపీ నాయకుడు అనుచితంగా మాట్లాడారు.
తను ఫోటోలు తీయమన్నది బీజేపీ కార్యకర్తల ఇళ్లకు మాత్రమేనని, ప్రజలకు సంబంధించి కాదని మహేంద్ర భట్ అన్నారు. "ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుకు ప్రతి ఒక్కరూ ప్రతిస్పందించాలని నేను కోరుకుంటున్నాను" అని ఆయన అన్నారు. అయితే అంతకుముందు ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో మహేంద్రభట్ ఇళ్లపై జాతీయ జెండాను పెట్టుకోని వారిని నమ్మవద్దని పిలుపునిచ్చారు. అలాంటి ఇళ్లను ఫోటో తీసి తనకు పంపించాలని కూడా పార్టీ కార్యకర్తలతో అన్నారు. అంతేకాదు ఇంటిపై జెండా ఉంచితేనే దేశభక్తి ఉన్నట్టుగా.. లేకపోతే దేశంపై నమ్మకం లేనివారని కూడా అన్నారు. "త్రివర్ణ పతాకం పెట్టని ఇంటిని మనం నమ్మలేం. నాకు అలాంటి ఇళ్ల ఫోటోలు కావాలి. సమాజం అలాంటి ఇళ్లను, అలాంటి కుటుంబాలను చూడాలి." అని అన్నారు.