విద్య కాషాయీకరణకు, కార్పోరేటీకరణకు కేంద్రంలోని బిజెపి సర్కార్ కుట్ర పన్నుతోందని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి. లక్ష్మీరాజా విమర్శించారు. శుక్రవారం యుటిఎఫ్ భవన్ వద్ద స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌టిఎఫ్‌ఐ) 23వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్‌టిఎఫ్‌ఐ పతాకాన్ని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి రాజా, జాతీయ పతాకాన్ని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయకుమార్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బి. లక్ష్మి రాజా మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి సర్కార్ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తోందని తెలిపారు. అందులో భాగంగానే నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. యుటిఎఫ్ జిల్లా కార్యదర్శులు పి. చంద్రశేఖర్, ఎస్. దావుద్దీన్, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎం. ప్రభాకర్, కడప నగర కార్యదర్శి ఎల్. కరీముల్లా, సి. కె. దిన్నె మండల ట్రెజరర్ రమణ పాల్గొన్నారు.