భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయింది. ఎందరో అమరవీరులు త్యాగ ఫలమే నేడు మనం అనుభవిస్తున్నాం. ఉద్యమ కాలంలో ముఖ్య భూమిక పోషించిన పట్టణాలు, నగరాలు, ఆయా ప్రాంతాల్లో రగిలించిన ఉద్యమ స్ఫూర్తి జ్ఞప్తికి వస్తుంది. అటువంటి చరిత్ర ఉమ్మడి జిల్లాలకు ఉంది.
ఇక్కడి నుంచే అల్లూరి.
రాజమహేంద్రవరంలో చదువుకున్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేక బీజం పడింది రాజమహేంద్రవరంలోనే. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అల్లూరి తన తండ్రి వృత్తి రీత్యా రాజమహేంద్రవరంలో స్థిరపడాల్సి వచ్చింది. ఆ సమయంలో గుర్రాల పై సంచరించే తెల్లదొరలకు సలామ్ చెప్పడాన్ని పిన్న వయసులోనే వ్యతిరేకించారు అల్లూరి సీతారామరాజు. స్వాతంత్రోద్య మంలో గాంధీ మార్గం అహింసా వాదాన్ని వ్యతిరేకించారు. తెల్లదొరలపై గెరిల్లా పోరాటాలకు పురిగొల్పి బ్రిటీష్ పాలకులను పరుగులు పెట్టించారు. విద్యాబుద్ధులు నేర్చుకుని అల్లూరి అడవి బాట పట్టారు. గిరిజనులను చైతన్యవంతం చేసి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పెద్ద పోరాటాన్ని నిర్మించారు. తూర్పు, విశాఖ ఏజన్సీలు కేంద్రంగా అల్లూరి పోరాటం చేశారు.
ఉమ్మడి జిల్లాలో మహాత్మాగాంధీ అడుగులు..
స్వాతంత్య్ర సముపార్జనలో తన జీవితాన్ని దారపోసిన మహనీయుడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. స్వాతంత్య్రానికి ముందు రాజమహేంద్రవరం నాలుగు సార్లు వచ్చారు. ఆయన తొలిసారి 1921 మార్చి 30న విజయనగరం నుంచి రాజమహేంద్రవరం వచ్చారు. రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ వద్ద జరిగిన సభలో మాట్లాడారు. అప్పుడు ప్రజలకు స్వదేశీ వస్తువులు వినియోగించాలని, స్వరాజ్యనిధికి విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
1921 ఏప్రిల్ 6న కాకినాడ లో స్వాతంత్ర్య ఉద్యమ సభను నిర్వహించారు. అనంతరం రాజమహేంద్రవరం వచ్చి పాల్ చౌక్‌లో ఏర్పాటు చేసిన సభకు పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు. 1929 మే 7న గాంధీ రాజమహేంద్రవరం పాల్‌చౌక్‌లో ఏర్పాటు చేసిన సభకు సుమారు 20 వేల మంది వచ్చారు. 1933 డిసెంబరు 25న గాంధీజీ మద్రాసు నుంచి రాజమహేంద్రవరం పాల్ చౌక్‌కు చేరుకుని బహిరంగ సభ నిర్వహించారు. 1946లో రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఆయన ఆ రోజు మౌనవ్రతంలో ఉండటం వల్ల తాను మాట్లాడాలనుకున్న ప్రసంగాన్ని ఒక పేపరుపై రాసి వేరోకరితో చదివించారు. ఇలా ఉమ్మడి జిల్లాలతో మహాత్మాగాంధీకి ప్రత్యేక అనుబంధం ఉంది.