రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా బైక్ ర్యాలీలు, ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగుర వేయాలని ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక పండుగలా జరిపించడానికి పూనుకుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్ర్య దినోత్సవం గొప్ప తనాన్ని గుర్తు చేసేలా మువ్వన్నెల జెండా ప్రదర్శనలు చేపట్టింది. ఈ క్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి చేపట్టిన జాతీయ జెండాతో బైక్ ర్యాలీ ఆకట్టుకుంది.
స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాలను పురస్కరించుకుని నీలకంఠాపురం దేవస్థానంలో రఘువీరారెడ్డి నిన్న జాతీయ జెండా ఎగురవ వేశారు. ఈ సందర్భంగా జాతీయ జెండాతో బుల్లెట్ బైక్‌పై సతీసమేతంగా ర్యాలీ నిర్వహించారు. నీలకంఠాపురంతో పాటు చుట్టుపక్కల ఉన్న 15 గ్రామాల్లో ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయించి.. ఆ 15 గ్రామాల్లో జెండాతో మోటార్ సైకిల్ యాత్ర నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఎంపీ నీలకంఠాపురం శ్రీరామరెడ్డి 29వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించి ఈ కార్యక్రమం చేపట్టినట్లు రఘువీరారెడ్డి తెలిపారు. బులెట్ బైక్‌పై భారీ ర్యాలీతో వస్తున్న వీడియోలను ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. ఆయన పోస్టింగ్‌లకు నెటిజన్లు స్పందిస్తూ సెల్యూట్ అంటూ రిప్లయ్ ఇచ్చారు. మీకు మీరే సాటి రఘువీరారెడ్డి అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.