మంత్రి పళనివేల్ త్యాగరాజన్ వాహనంపై చెప్పు విసిరిన వ్యవహారం మదురై బీజేపీలో కలకలం రేపింది. మదురై నగర బీజేపీ అధ్యక్షుడు శరవణన్ తీవ్ర మనస్తాపంతో పార్టీకి బై..బై చెబుతున్నట్టు ప్రకటించారు.ఇక మంత్రితో భేటీ కావడంతో ఆయన్ని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆదివారం ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా డీఎంకే ఎమ్మెల్యే డాక్టర్ శరవణన్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో మదురై నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యాడు. అయినా, బీజేపీ పెద్దలు ఆయనకు మదురై నగర పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. డీఎంకేపై ఇన్నాళ్లు విమర్శనాస్త్రాలు ఎక్కుబెడుతూ వచ్చిన శరవణన్‌కు శనివారం తుది నిర్ణయం ప్రకటించారు.
ముష్కరుల దాడిలో అమరుడైన ఆర్మీ జవాన్ లక్ష్మణన్‌కు మదురై విమానాశ్రయంలో మంత్రి పళని వేల్ త్యాగరాజన్ శనివారం నివాళులర్పించిన విషయం తెలిసిందే. బయటకు వెళ్తున్న సమయంలో ఆయన వాహనంపై బీజేపీ నాయకులు విరుచుకుపడ్డారు. చెప్పు విసరడంతో పోలీసులు రంగంలోకి దిగి, బీజేపీ నాయకులు ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటనను మదురై నగర బీజేపీ అధ్యక్షుడు శరవణన్ తీవ్రంగా పరిగణించారు. మంత్రికి క్షమాపణలు చెప్పాలని నిర్ణయించారు.అర్ధరాత్రి వేళ మంత్రిని కలిసిసారి చెప్పడమే కాకుండా, బీజేపీ మతతత్వ పార్టీ అని, ఇటీవల కాలంలో రాష్ట్రంలో పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు తనను బాగా కలిచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ చర్యలను ఖండిస్తూ ఆ పార్టీ నుంచి వైదొలగనున్నానని శరవణన్ ప్రకటించారు. దీంతో ఆదివారం ఉదయాన్నే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై శరవణన్‌ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. శరవణన్ స్పందిస్తూ డీఎంకే తన మాతృ సంస్థ అని అయితే, ఇక డాక్టర్ వృత్తిపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు.