ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కృష్ణాష్టమి ఎలా జరుపుకోవాలి..!

Bhakthi |  Suryaa Desk  | Published : Fri, Aug 19, 2022, 12:14 PM

శ్రావణమాసం అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పర్వదినం శీకృష్ణాష్టమి.


"కృష్ణం వందే జగద్గురుమ్" అని సకల జాతులవారూ ఆ పరమాత్మను స్తుతిస్తారు. ధర్మమునకు హాని, అధర్మమునకు అభ్యుత్థానం జరిగినపుడు, ధర్మరక్షకుడు శ్రీకృష్ణుడు తనను తానే సృజించుకొంటాడు.


సకల లోకేశ్వరుడు, ఆకర్షణ స్వరూపుడు అయిన కృష్ణుడి యెుక్క ఆవిర్భావం జరిగిన రోజు శ్రావణమాసం, కృష్ణ పక్షం, అష్టమి.


ఒకప్పుడు వేలకొలది రాక్షసులు ద్వాపరయుగం చివరి పాదంలో మహారాజుల వంశములో జన్మించారు. కంసుడు, జరాసంధుడు, శిశుపాల, దంతవక్త్రాదులు, కలిపురుషుని అంశతో దుర్యోధనాదులు జన్మించారు. వీరి పరిపాలనను భూమి తట్టుకోలేక పోయింది. గోరూపం ధరించి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి రక్షించమని ప్రార్థించింది. బ్రహ్మ ఆమెను ఓదార్చి, ఆమెతో కలిసి వైకుంఠానికి వెళ్ళాడు. అప్పుడు శ్రీహరి వారికి అభయం యిచ్చి కనబడకుండా వారితో త్వరలో భూమి మీద అవతరించి దుష్టశిక్షణ చేస్తానని వరమిచ్చాడు.


అలా వరమిచ్చిన స్వామి వారు శ్రావణమాసంలో బహుళాష్టమీ తిథినాడు సరిగ్గా అర్ధరాత్రి పూట, సూర్యుడు, కుజుడు, బృహస్పతి, శుక్రుడు, శనైశ్చరుడు ఈ ఐదుగురు ఉచ్ఛ స్థితిలో నుండగా శ్రీకృష్ణుడనే నామంతో అవతరించాడు.


125 సంవత్సరాలు ఈ అవతారంలో భూమి మీద నివసించి అనేక లీలలు చేసి చూపించాడు. భూభారం తొలగించాడు. అన్నింటినీ మించి ప్రపంచంలో ఎక్కడా ఎవ్వరూ అందించని మహాద్భుత గ్రంథాన్ని "భగవద్గీత" ను లోకానికి అర్జునుడనే శిష్యుని మిషతో అందించాడు.


జగద్గురుడంటే శ్రీకృష్ణుడే అని ఆదిశంకరుల వంటివారు అన్నారంటే దానికి కారణం భగవద్గీతయే.


భగవంతుడు 22 అవతారాలు ఎత్తుతాడనీ, వాటిలో 21 అంశావతారాలనీ, ఒక్క శ్రీకృష్ణావతారమే పరిపూర్ణావతారమనీ శ్రీమద్భాగవతం చెబుతోంది.


"ఏతే చాంశ కలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయమ్" అని వ్యాసుడన్నాడు.


ఇంతటి శ్రీకృష్ణావతారాన్ని లోకానికి అందించిన పవిత్రమాసం శ్రావణ మాసం.


ఈ తిథినాడు శుచిగా ఉండి, శ్రీకృష్ణుడిని పది తులసీదళాలతో పూజిస్తూ,


1) కృష్ణాయ నమః,


2) విష్ణవే నమః


3) అనంతాయ నమః


4) గోవిందాయ నమః


5) గరుడధ్వజాయ నమః


6) దామోదరాయ నమః


7) హృషీకేశాయ నమః


8) పద్మనాభాయ నమః


9) హరయేనమః


10) ప్రభవే నమః


అనే దశ మంత్రాలను ఉచ్చరించాలి.


తరువాత ప్రదక్షిణాదులు చేసిన వానికి శ్రీకృష్ణానుగ్రహం కలుగుతుంది.


శ్లో|| దశాహం కృష్ణదేవాయ పూరికాదశచార్పయేత్||


అష్టమి మెుదలుకొని వరుసగా పదిరోజులు శ్రీకృష్ణుని తులసీదళాలతో అర్చిస్తూ పది పూరీలు నివేదించిన వానికి సారూప్యం(కృష్ణుని వంటి రూపం) అనే ముక్తి లభిస్తుంది.


* కృష్ణుడు మనం భక్తితో సమర్పించిన ఎటువంటి అలంకారాన్నైనా, ఫలమునైనా, పుష్పమునైనా, పత్రమునైనా స్వీకరిస్తాడు.


* కృష్ణుని విగ్రహానికి షోడశోపచార పూజలు చేయాలి, తులసీదళాలతో పూజించాలి.


* మంచి ఉద్యోగం కోసం కృష్ణాష్టమి నాడు తులసీదళాలతో పూజించాలి.


* కృష్ణుడికి తాజా వెన్న సమర్పించాలి. కృష్ణాష్టమి నాడు కృష్ణుడికి ఆవు పాలతో చేసిన పాయసం నివేదిస్తే ఎటువంటి అనారోగ్యం దరిచేరదు. సాయంత్రం కృష్ణ మందిరానికి వెళ్లి కృష్ణ దర్శనం చేసుకోవాలి.


* కృష్ణాష్టమి నాడు ఉట్టి కొట్టే కార్యక్రమం చేయాలి.


* ఈరోజు తప్పకుండా గోసేవ చెయ్యాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com