ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్యాన్సర్‌పై అవగాహన, ముందస్తు గుర్తింపు ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. క్యాన్సర్‌పై పోరాటాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా తన ఆరోగ్యం గురించి ఓ ఆసక్తికర విషయాన్ని చిరంజీవి వెల్లడించారు. తాను ఎంతో ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తానని, అయినా ముందుజాగ్రత్తగా కోలనోస్కోపీ పరీక్ష చేయించుకున్నానని తెలిపారు. ఆ పరీక్షలో నాన్-క్యాన్సరస్ పాలిప్స్ కనపడటంతో వాటిని తొలగించారని చెప్పారు. అయితే, దీనిపై అవగాహన లేని కొందరు జర్నలిస్టులు తనకు క్యాన్సర్ వచ్చిందని, దాని నుంచి బయటపడ్డానని రాశారని, అది వాస్తవం కాదని స్పష్టం చేశారు. క్యాన్సర్‌గా మారే చిన్న అవకాశాన్ని కూడా తీసుకోకూడదనే ఉద్దేశంతోనే ఆ పరీక్ష చేయించుకున్నానని అన్నారు. అలాగే, తాను క్రమం తప్పకుండా పీఎస్‌ఏ వంటి పరీక్షలు చేయించుకుంటూ ఉంటానని తెలిపారు.శరీరం చెప్పే మాటను వినాలని, 'నాకు రాదులే' అనే నిర్లక్ష్యం పనికిరాదని చిరంజీవి గట్టిగా చెప్పారు. తన స్నేహితుడు ఒకరు లంగ్ క్యాన్సర్ బారిన పడినా, తొలిదశలోనే గుర్తించడం వల్ల చికిత్సతో బయటపడి గత పదేళ్లుగా ఆరోగ్యంగా జీవిస్తున్నారని ఉదహరించారు. జీవనశైలి, వాతావరణం, వంశపారంపర్య కారణాల వల్ల ఎవరికైనా క్యాన్సర్ రావొచ్చని, కానీ 90 శాతం కేసుల్లో తొలిదశలో గుర్తిస్తే నయం చేయవచ్చని వివరించారు.ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించాలని చిరంజీవి కోరారు. 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయిస్తే, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా 100 శాతం రక్షించవచ్చని వైద్యులు చెబుతున్నారని గుర్తుచేశారు. 45 ఏళ్లలోపు మహిళలు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదని సూచించారు. తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా గర్భాశయ సంబంధిత సమస్యలను కూడా ముందుగానే గుర్తించవచ్చని ఆయన అన్నారు.భారత్‌లో ప్రతి సంవత్సరం 14 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, ప్రతి నిమిషానికి ముగ్గురు ఈ వ్యాధి బారిన పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చాలంటే పోలియో, మశూచి నిర్మూలన తరహాలో క్యాన్సర్‌పై కూడా ఒక ఉద్యమంలా పోరాడాలని పిలుపునిచ్చారు. పొగాకు, ధూమపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని హితవు పలికారు. క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తనవంతు బాధ్యతగా భవిష్యత్తులో షార్ట్ ఫిలిమ్స్ నిర్మించడానికి సిద్ధంగా ఉన్నానని చిరంజీవి ప్రకటించారు. ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని కలిసిన కొద్దిరోజులకే కిమ్స్ నుంచి ఆహ్వానం రావడం దైవ సంకల్పంగా భావించానని, అందుకే వెంటనే అంగీకరించానని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa