బాలీవుడ్ లో చిన్న నుంచి పెద్ద వరకూ ఏ స్టారైనా.. సెలబ్రిటీయైనా కపిల్ శర్మ కామెడీ షోలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే కపిల్ శర్మ షో -2 లో ఆస్కార్ అవార్డ్ గ్రహీత.. ప్రఖ్యాత సంగీత దర్శకులు ఏ. ఆర్. రెహమాన్ ముఖ్య అతిథిగా హాజరైనారు. అంతవరకూ బాగానే ఉంది. కపిల్ శర్మ షోలో సాధారణంగానే మోతాదుకు మించిన.. తెలుగు జబ్బర్దస్త్ తరహా కామెడీ ఎక్కువ కనిపిస్తుంటుంది. అయితే చాలామంది సెలబ్రిటీలు దానిని ఎంజాయ్ చేస్తుంటారు. కొందరు నచ్చకపోయినా పైకి ప్లాస్టిక్ నవ్వులతో షోకొచ్చాక తప్పుతుందా అన్నట్టుగా కూడా కానిచ్చేస్తుంటారు. అయితే సంగీత దర్శకులు ఏ.ఆర్. రెహమాన్ పాల్గొన్న షోలో ఆ మోటు సరసం కాస్తా బెడిసికొట్టిందన్నది బాలీవుడ్ వర్గాల టాక్.
కపిల్ శర్మ కామెడీ షోలో మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అలీఅస్గర్. కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన అలీ అస్గర్.. ఆడరూపంలోకి రూపాంతరం చెంది కపిల్ షోలో చేసే మోటు కామెడీ.. షో చూసే వారందరికీ తెలిసిందే. వారెంత పెద్ద సెలబ్రిటీలైతే.. మరింతెక్కువ చుంబనాలు పెడుతున్నట్టు ఓవర్ యాక్టింగ్ తో మోటు సరసం చేస్తుంటానని.. రెహమాన్ పాల్గొన్న కపిల్ శర్మ షో తర్వాత వచ్చిన విమర్శలతో అలీ అస్గర్ స్వయానా తానే చెప్పుకొచ్చాడు. అయితే.. అదే అలీఅస్గర్ రెహమాన్ తోనూ తన శైలిలో మోటు సరసాన్ని ప్రదర్శిస్తూ .. టచ్ చేయబోవడంతో రెహమాన్ తనను టచ్ చేయొద్దని సున్నితంగా వార్నింగ్ ఇచ్చాడట. అయితే ఆ షో లో జరిగిన చాలా సీన్లను కట్ చేసి.. ఎడిట్ చేసి ప్రసారం చేసినట్టుగా కూడా బాలీవుడ్ కోడై కూస్తోంది.
పైగా రెహమాన్ తో నిర్వహించే షో విషయంలో కపిల్ శర్మ పక్కా ప్లాన్ లేకుండా ముందుకెళ్లడంతోనే అలా జరిగిందని.. అందరు సెలబ్రిటీలను ఒక్కటే గాటన కట్టడం.. అసలే కొంత సిగ్గరిలా రిజర్వుడ్ గా కనిపించే రెహమాన్ విషయంలోనూ తన షోలోని మూస పద్ధతులను అనుసరించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా రెహమాన్ రంగీలా సినిమాతో తన బాలీవుడ్ ప్రస్థానాన్ని ప్రారంభించి.. ఆశుతోష్ గోవారీకర్ సినిమాలన్నింటికీ రెహమానే సంగీతం వహించారంటూ.. కపిల్ శర్మ చేసిన వ్యాఖ్యానం జనాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉందని.. రంగీలా తీసింది రాంగోపాల్ వర్మైతే.. రంగీలాతో మొదలై ఆశుతోష్ గోవారీకర్ సినిమాలన్నింటికీ రెహమాన్ సంగీతం వహించారని చెప్పడంతో.. రంగీలా డైరెక్టర్ కూడా ఆశుతోష్ గోవారీకరనే భావనతో కపిల్ శర్మ మాట్లాడాడా.. అసలు సోయిలో ఉన్నాడా అనే విమర్శలు కూడా చుట్టుముట్టాయి. కపిల్ శర్మ కామెడీ షో దెబ్బకు ఇక ముందు రెహమాన్ టీవీ షోలకు హాజరవుతారా అన్నది సందేహమేనన్న చర్చ ఓవైపు మొదలుకాగా.. రెహమాన్ అతిథిగా హాజరై.. కపిల్ శర్మ అండ్ కో స్టార్స్ వ్యవహరించిన తీరుతో కొంత అవమానంగా ఫీలైన ఆ షోకు జనాదరణ మాత్రం విపరీతంగా రావడం కొసమెరుపు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa