ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్.... !

cinema |  Suryaa Desk  | Published : Wed, May 20, 2020, 11:58 AM

పౌరాణికం, జానపదం, సాంఘికం., పాత్ర ఏదైనా, సంభాషణలు ఎలాంటివైనా అద్భుత నటనతో రక్తి కట్టించడంలో నందమూరి తారక రామారావును మించిన వారు లేరు. అందుకే ఆయన విశ్వ విఖ్యాత నటసార్వభౌముడయ్యారు. తెలుగు పరిశ్రమలో అగ్రకథానాయకుడిగా నీరాజనాలందుకున్నారు. కేవలం కళారంగంలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ అడుగిడి ప్రజలకు తనవంతు సేవచేసి తెలుగు ప్రజల మదిలో నందమూరి తారక రామారావు ఆరాధ్య దైవమయ్యారు. వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి ప్రేక్షకులను మెప్పించిన ఆయన, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో ఆంధ్రుల హృదయాల్లో గొప్పమనిషిగా నిలిచిపోయారు. సీనియర్ ఎన్టీఆర్ పోలికలతో సినిమాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గా ప్రేక్షకుల్లో బలమైన పునాదినే వేశాడు. పోలికల్లో, నటనలో, హావభావాల్లో, వాచకంలో, వాగ్దాటిలో, డైలాగులు చెప్పడంలో అచ్చం సీనియర్ ఎన్టీఆర్ నే మరిపించాడు. ఆనాటి సినిమాలల్లో మాయాబజార్‌, లవకుశ, శ్రీకృష్ణార్జున యుద్దం, భీష్మ, భూకైలాష్‌, నర్తనశాల, పాండవ వనవాసం, శ్రీ వెంకటేశ్వరస్వామి మహత్యం, మహామంత్రి తిమ్మరుసు, దానవీరశూరకర్ణ చిత్రాలు విశ్వ విఖ్యాత ఎన్‌టిరామారావును మకుటం లేని మహారాజుగా నిలబెట్టాయి. తాత పాత్రలు చేయాలని జూనియర్ ఎన్టీఆర్ ని ఎప్పటి నుంచో చాలా మంది కోరుతూనే ఉన్నారు. రాజమౌళి సినిమా యమదొంగలో డూప్ రావణాసురుడిగా చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. 1991లో ఎన్టీఆర్... బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా తీస్తున్నారు. ఆ చిత్రంలో మనవడు తారక్​కు భరతుడి వేషం ఇచ్చి ప్రోత్సహించారు. స్వయంగా తానే మేకప్ వేసి ఎలా నటించాలో మెళకువలు నేర్పారు. ఆ మూవీతో ఎన్టీఆర్ బాల నటుడిగా తెరంగేట్రం చేసినట్లయింది. శబ్దాలయ థియేటర్స్ పతాకంపై కవి, నిర్మాత మల్లెమాల 1996లో నిర్మించిన బాల రామాయణం చిత్రంలో శ్రీరాముడిగా జూనియర్ ఎన్టీఆర్ నటించాడు. తాతను అనుకరిస్తూ చాలా సినిమాల్లో తారక్ చెప్పిన డైలాగులు అభిమానుల చేత ఈలలు వేయించాయి. ఉత్తమ బాలల చిత్రంగా బాల రామాయణం జాతీయ పురస్కారాన్ని అందుకుంది. ఈ చిత్రంలో నటించినవారంతా చిన్నారులే. సుమారు 3 వేల మంది ఇందులో నటించారు. జంటనగరాల్లోని 30 స్కూళ్ల లో విద్యార్థులను ఎంపిక చేసింది చిత్ర యూనిట్. దర్శకుడు గుణశేఖర్ సినీ కెరీర్ లో మెచ్చు తునకగా ఈ సినిమా నిలిచిపోతుంది. విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఈ చిత్రం అనేక సాంస్కృతిక సంస్థల నుంచి పురస్కారాలను అందుకుంది. యమదొంగ చిత్రంలో కాసేపు యంగ్ యమాగా కనిపించి కనువిందు చేశాడు. ఈమూవీలో తారక్ చెప్పిన ‘మానవ జాతి అంత నీచమా’ అంటూ జూనియర్ పలికిన లెంగ్తీ డైలాగ్స్ ప్రేక్షకుల చేత ఈలలు వేసేలా చేశాయి. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆయన కొమరం భీం పాత్రలో కనిపించనున్నారు. జై లవకుశలో మూడు విభిన్న పాత్రల్లో అది కూడా ఒకే డ్రెస్ వేసుకొని కేవలంతోనే నటనను పండించి ఔరా అనిపించాడు ఎన్టీఆర్. ఇప్పటి ఈ తరం హీరోలల్లో త్రిపాత్రాభినయం చేసిన హీరోలు ఎవరూ లేరు. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ తప్ప. తాత పాత్రలను చేసే నటనాభినయం ఎన్టీఆర్ కు మాత్రమే ఉంది. దానవీర శూర కర్ణగా, రావణుడిగా, రాముడిగా, కృష్ణుడుగా, రాక్షసుడిగా, వీరుడిగా, పోరాట యోధుడిగా.. ఇలా ఎన్నో పాత్రలు చేయగలిగే కెపాసిటీ ఇప్పుడున్న జనరేషన్ లో ఒక్క ఎన్టీఆర్ కు తప్పా మరెవ్వరికీ లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ నటవారసుడి నటనతత్వాన్ని పునికిపుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ నేడు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు. ఆ నటశూరవీరాధినేత జూనియర్ ఎన్టీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa