మనం చేయగల పాత్రలేవో వాటినే ఎంచుకొని సమర్థవంతంగా చేయాలంటోంది ముంబయి చిన్నది దక్ష నగర్‌కర్. 2015లో 'హోరాహోరి'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత 'హుషారు'తో మరింత దగ్గరైంది. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఆమె నటించిన చిత్రం 'జాంబీరెడ్డి' విడుదలకు సిద్ధంగా ఉంది. కల్కీ, అ ఆసక్తికరమైన చిత్రాల దర్శకుడు ప్రశాంత్‌వర్మ తెరకెక్కించారు. తేజ సజ్జా, ఆనంది, దక్ష కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. హాలీవుడ్ చిత్రాలకు మాత్రమే పరిమితమైన 'జాంబీ' జానర్‌లో తొలిసారిగా తెలుగులో వస్తున్న సినిమా ఇది. ఫిబ్రవరి 5న విడుదల కానుంది. ఈనేపథ్యంలో దక్ష మీడియాతో ముచ్చటించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
నాకు హర్రర్ సినిమాలంటే చాలా ఇష్టం. జాంబీ సినిమాలు చాలా చూశాను. నేను దిల్లీలో ఉన్నప్పుడు డైరెక్టర్ ప్రశాంత్‌గారు ఫోన్ చేసి మొదటిసారిగా తెలుగులో మనం ఒక జాంబీ సినిమా చేయబోతున్నాం అని చెప్పారు. కథ విన్న తర్వాత చాలా నవ్వాను. థియేటర్లో మీరు కూడా కడుపుబ్బా నవ్వడం మాత్రం గ్యారెంటీ. నాలో మరింత ఆసక్తి పెరిగింది. ఇది 'జాంబీ కామెడీ' చిత్రం. పక్కా కమెర్షియల్ సినిమా ఇది.
లాక్‌డౌన్‌కు ముందు కొంత షూట్ చేశాం. ఆ తర్వాత మిగిలింది పూర్తిచేశాం. లాక్‌డౌన్ తర్వాత షూట్ చేసిన తొలి తెలుగు సినిమా కూడా మాదే. దాదాపు 600 నుంచి 700 మందితో షూట్ చేశాం. కరోనా సమయంలో మాక్కూడా భయం వేసింది. కానీ.. అందరికీ శానిటైజేషన్, కరోనా పరీక్షలు చేయడం.. ఇలా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం.
ఈ సినిమాలో నా పాత్ర పేరు 'మ్యాగీ'. చాలా కొత్తగా రాశారు. అన్ని పాత్రలు ఒకలా ఉంటే నా పాత్ర మాత్రం భిన్నంగా ఉంటుంది. స్నేహితులంతా కలిసి జాంబీల నుంచి ఒక ఊరిని ఎలా కాపాడతారనేదే ఈ సినిమా కథ. ఇది నాకేదో బ్రేక్ ఇస్తుందని చేసిన సినిమా కాదు. మంచి డైరెక్టర్, మంచి కథ వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలనే ఈ సినిమా చేశాను.
నేను డైరెక్టర్ తేజగారితో మొదటి సినిమా(హోరాహోరీ) చేసినప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. అప్పుడు బీబీఏ చదువుతున్నాను. షూటింగ్ వల్ల ఫస్ట్ ఇయర్ పరీక్షలు కూడా రాయలేదు. ఫెయిల్ అయ్యాను. అందుకే చదువు పూర్తి చేశాక సినిమాలు చేయాలని నిర్ణయించుకొని డిగ్రీ పూర్తి చేశాను. ఆ తర్వాత రెండేళ్లకు 'హుషారు' సినిమాకు సంతకం చేశాను. అంతకు ముందు కొన్ని సినిమాలు చేసినా.. అవి చాలా చిన్నపాత్రలు. అందుకే వాటిని లెక్కలోకి తీసుకోవడం లేదు. 'హుషారు' తర్వాత నేను కావాలని విరామం ఇవ్వలేదు. ఇప్పటికే రెండు పెద్ద సినిమాలకు సంతకం చేశాను. అందులో ఒకటి యూఎస్‌లో షూట్ చేయాల్సి ఉంది. కరోనా.. లాక్‌డౌన్ వల్ల అది ఇంకా మొదలుకాలేదు. అమెరికా వెళ్లేందుకు అనుమతి రాగానే షూటింగ్ ప్రారంభిస్తాం. మొత్తం మూడు సినిమాలున్నాయి. అవి మొదలైతే తర్వాత సినిమాల గురించి ఆలోచిస్తా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa