హాలీవుడ్ క్లాసిక్ మూవీ ఫారెస్ట్ గంప్ (1994) కి ఇండియన్ రీమేక్ గా తెరకెక్కిన సినిమా లాల్ సింగ్ చద్దా. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ లీడ్ రోల్ లో నటించాడు, కరీనా కపూర్ ఖాన్ ఫిమేల్ లీడ్ లో నటించింది. టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని వారసుడు నాగచైతన్య కీలక పాత్రలో నటించారు. ఈ మూవీతోనే చైతూ బాలీవుడ్ జనాలను పలకరించబోతున్నాడు. వాస్తవానికి ఈ మూవీ ఏప్రిల్ 14న విడుదల కావాల్సి ఉంది, కానీ ఆ తేదీన కేజీఎఫ్ ఉండటంతో లాల్ సింగ్ చద్దా ఆగస్టు 11 కు వాయిదా పడింది.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ఉత్తరాదిన ప్రశంసలందుకుంటుంది. లాల్ సింగ్ చద్దా తో ఆమీర్ మరో క్లాసిక్ కు తెరతీసారని అంటున్నారు. జన్మతహా దివ్యాంగుడిగా జన్మించిన హీరో, తల్లి ప్రోత్సాహంతో తన అంగవైకల్యాన్ని జయించి, సైనికుడిగా మారి దేశసేవ చేస్తుంటాడు. ఈ క్రమంలో హీరో ఎదుర్కొన్న సంఘటనలు, అవమానాలు, అంగవైకల్యాన్ని జయించిన తీరును హృదయానికి హత్తుకునేలా చూపించిన ట్రైలర్ నిజంగా ప్రేక్షకుల కంట కన్నీరు తెప్పిస్తుంది. ఈ ట్రైలర్ యూట్యూబులో విడుదలైన 24గంటల్లోనే 62మిలియన్ వ్యూస్ ను సాధించడం విశేషం.