టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా నటించిన అన్ని భాషల్లోనూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు ప్రకాష్ రాజ్. దేశం గర్వించదగ్గ నటుడైన ప్రకాష్ రాజ్ నటించిన కొత్త సినిమా మేజర్. అడవి శేష్ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రానికి శశికిరణ్ తిక్కా డైరెక్టర్. 2008 ముంబై దాడుల్లో ఎంతో మంది అమాయక ప్రజల ప్రాణాలను కాపాడి, చివరికి దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరక్కింది. పాన్ ఇండియా భాషల్లో జూన్ 3వ తేదీన విడుదల కానుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ప్రీమియర్ షోలను నిర్వహిస్తున్న చిత్రబృందం ప్రమోషన్స్ లో కూడా చురుగ్గా పాల్గొంటుంది.
ఈ సినిమాలో మేజర్ సందీప్ కు తండ్రిగా ప్రకాష్ రాజ్ నటించారు. ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ మేజర్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాలో నటించినందుకు తనకు చాలా గర్వంగా ఉందని, తన పాత్ర ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేవిధంగా ఉంటుందని ప్రకాష్ రాజ్ తెలిపారు. దేశపౌరులందరూ తప్పక చూడాల్సిన సినిమా అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.