కమర్షియల్ సినిమాలలో గ్లామర్ రోల్స్ తో ఇప్పటి వరకు సందడి చేసిన బుట్టబొమ్మ పూజాహెగ్డే ఇకపై తనలోని యాక్షన్ కోణాన్ని బయటపెట్టబోతుంది. పూరీజగన్నాద్ డైరెక్షన్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ లీడ్ రోల్ లో ఇటీవలనే ఒక సినిమా ఎనౌన్స్మెంట్ జరిగింది. పూరీ డ్రీం ప్రాజెక్ట్ గా పేర్కొనబడుతున్న ఈ మూవీకి ముందుగా జనగణమణ అనే టైటిల్ ను అనుకున్నారు కానీ JGM అనే టైటిల్ తో ఈ సినిమాను ఎనౌన్స్ చెయ్యటం విశేషం. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై వంశీ పైడిపల్లి, ఛార్మికౌర్ నిర్మిస్తున్నారు. విజయ్ కు జోడిగా పూజాహెగ్డే నటించబోతుంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు, JGM మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో నడిచే కధ. దీంతో ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని అంటున్నారు. హీరో పాత్రకు ధీటుగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ఉండనుందట. పవర్ఫుల్గా ఉండబోయే పూజా కూడా కొన్ని యాక్షన్ సీన్లలో నటించాల్సి ఉందట. అందుకోసం పూజకు మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ ఇప్పించనున్నారట JGM చిత్రబృందం. ఇందుకోసం థాయిలాండ్ నుండి మార్షల్ ఆర్ట్స్ నిపుణులను ముంబైకి రప్పిస్తున్నట్టు సమాచారం. రేపటి నుండే పూజకు మార్షల్ ఆర్ట్స్ క్లాసులు స్టార్ట్ అవుతాయట. మూడు రోజుల పాటు జరిగే ఈ ట్రైనింగ్ క్లాసులు కొన్నిరోజుల గ్యాప్ తర్వాత తిరిగి ప్రారంభమవుతాయట. సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే పూజా ఈ విషయమై ఏదైనా చిన్న హింట్ ఇస్తుందేమో చూడాలి.