బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. మోడరన్ మైథలాజికల్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున, మౌని రాయ్ కీలకపాత్రలు పోషించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9వ తేదీన విడుదల కానుంది. మూవీ విడుదలకు ఇంకా 100రోజుల గడువున్న నేపథ్యంలో చిత్రబృందం చిన్న గ్లిమ్స్ వీడియోను నిన్న విడుదల చేసింది. ఆ వీడియోలో జూన్ 15వ తేదీన ట్రైలర్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ మేరకు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా, హీరో రణ్ బీర్, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, తెలుగులో ఈ మూవీని సమర్పిస్తున్న రాజమౌళి ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో ప్రమోషన్స్ ను ప్రారంభించారు. ఈ మేరకు జరిగిన ఒక ప్రెస్ మీట్లో రాజమౌళి అయాన్ ను ఇలా అడుగుతారు. బ్రహ్మాస్త్ర స్క్రీనింగ్ ను నాకు కాకుండా మా నాన్నగారైన విజయేంద్ర ప్రసాద్ కు ఎందుకు చూపించారు? అని జక్కన్న అడగ్గా, అయాన్ వెంటనే అందుకుని " మీ నాన్నగారిని మీ నుంచి దొంగిలిద్దామని" అనగానే అందరూ ఫక్కున నవ్వుతారు. అయాన్ మాట్లాడుతూ... రాజుగారి దగ్గర బ్రహ్మాస్త్రం లాంటి విజయేంద్ర ప్రసాద్ గారున్నారు. అలాంటి బ్రహ్మాస్త్ర నుండి నేను కూడా కొంత పవర్ పొందుదామని ఆయనకు సినిమాను చూపించడం జరిగింది. వీలైనంత త్వరలో మీకు కూడా సినిమా చూపిస్తాను సర్... అని రాజమౌళితో అయాన్ అంటాడు. ఆ వెంటనే రాజమౌళి మాట్లాడుతూ... మా నాన్నగారు ఎన్నో సినిమాలకు కథలనందించారు. కానీ పెద్ద సినిమాలు తీయాలంటే నా మీదే ఆధారపడ్డారు. ఇప్పుడు అయాన్ కూడా నాతో జాయిన్ అయ్యాడు. మా నాన్నగారిని నా నుండి దొంగిలించడంలో నువ్వు సక్సెస్ అయ్యావు అయాన్ ... అని అంటారు. ఈ సీన్ మొత్తం అక్కడ ఉన్నవారిని తెగ నవ్వించింది.