గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి తెలుగు ప్రేక్షకులకి అలాగే సంగీత ప్రేమికులకు పరిచయం అవసరం లేదు. తాజాగా ఇప్పుడు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఘనంగా నివాళులు అర్పించేందుకు సినీ మ్యూజిషియన్స్ యూనియన్, హైదరాబాద్ నాన్‌స్టాప్ మ్యూజికల్ ప్రోగ్రామ్‌ను ప్లాన్ చేసింది. దివంగత లెజెండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి ఆయన జయంతి సందర్భంగా అంటే జూన్ 4, 2022న 12 గంటల నిరంతర సంగీత నివాళి నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరగనున్న ఈ గ్రాండ్ మ్యూజికల్ ప్రోగ్రామ్‌కి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన 100 మందికి పైగా ప్రముఖ సంగీత దర్శకులు, ప్లే బ్యాక్ సింగెర్స్ మరియు సంగీతకారులు పాల్గొంటారు. ఈ ప్రత్యేక నివాళి కార్యక్రమానికి అభిమానులు అలాగే ప్రేక్షకులు భారీగా తరలి వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.