గత కొన్నాళ్ల నుండి కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ గా స్టార్ హోదాను అనుభవిస్తున్నాడు కంపోజర్ అనిరుధ్ రవిచంద్రన్. ఈ యువ మ్యూజిక్ డైరెక్టర్ తమిళంలో ఏ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తే అది హిట్టే... కమర్షియల్ మాట అటుంచితే మ్యూజికల్ గా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంటాయి అనిరుద్ కంపోజ్ చేసిన సినిమాలు. తాజాగా అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన చిత్రం విక్రమ్. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఉత్కంఠను రేకెత్తించే యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ హాసన్ లీడ్ రోల్ లో నటించగా, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, హీరో సూర్య కీలకపాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద విక్రమ్ సాలిడ్ వసూళ్లను రాబడుతుంది. ఈ సినిమాను కమల్ తన సొంత బ్యానర్ లో నిర్మించారు. విక్రమ్ సినిమా కమల్ కు చేతినిండా లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో కమల్ డైరెక్టర్ లోకేష్ కు లెక్సస్ కారును, హీరో సూర్యకు రోలెక్స్ వాచ్ ను, ఇంకా విక్రమ్ అసిస్టెంట్ డైరెక్టర్లకు అపాచీ బైక్స్ ను బహుమతిగా ఇచ్చారు.
విక్రమ్ మూవీ సక్సెస్ లో అనిరుద్ సంగీతం కూడా కీలక పాత్రను పోషించింది. మరి కమల్ నుండి అనిరుద్ కు కూడా మంచి బహుమతి అంది ఉండాలి కదా? ఇదే ప్రశ్నను ఒక విలేఖరి అనిరుద్ ను అడగ్గా, ఆయన చెప్పిన సమాధానం ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటుంది. కమల్ వంటి దిగ్గజ నటుడి సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచెయ్యడమే కోట్లు ఖరీదు చేసే బహుమతి అంటూ అనిరుద్ చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.