టాలీవుడ్ బాపుబొమ్మగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్ ఇటీవలే పండంటి పాపాయికి జన్మనిచ్చింది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్న ప్రణీత ట్రోలర్స్ చేతికి గట్టిగా చిక్కింది.
కర్ణాటక వాసులు సాంప్రదాయ బద్దంగా జరుపుకునే "భీమన అమావాస్య" పండుగ కు సంబంధించిన ఫోటోలను ప్రణీత సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో ఈ ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. భీమన అమావాస్య నాడు భార్యలు తమ భర్తల కాళ్లకు పూజ చేసి ఆశీర్వాదం తీసుకుంటారు. అలానే ప్రణీత కూడా చేసింది. ప్రణీత పోస్ట్ చేసిన ఫొటోల్లో భర్త నితిన్ రాజు కాళ్ల వద్ద ప్రణీత కూర్చుని పూజ చెయ్యడం కొంతమంది నెటిజన్లు తప్పుగా అర్ధం చేసుకుని ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలను పాటించడమేంటని, ఆడవాళ్ళ సమానత్వం, వారి హక్కుల గురించి ప్రణీతకు గుర్తు చేస్తున్నారు.
ఇందుకు ప్రణీత ఘాటుగానే స్పందించింది. తనకు తాను పెరిగిన సంప్రదాయం, ఆచారాలు అంటే చాలా ఇష్టమని, అందులో తప్పేముందని, కేవలం గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నంత మాత్రాన పుట్టి పెరిగిన ఆచారవ్యవహారాలను మర్చిపోతామా అంటూ నెటిజన్లకు కౌంటర్ ఇచ్చింది.