విజయ్ దేవరకొండ హీరో గా లైగర్ సినిమాతో బాలీవుడ్, కోలీవుడ్, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఎన్నో అంచనాల మధ్య ఈరోజు విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్క్రీన్ ప్లే, విజయ్ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా నత్తి ఉన్న బాక్సర్ పాత్రలో రౌడీ జీవించేశాడని.. మొత్తంగా లైగర్ చిత్రం వన్ మ్యాన్ షో అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు. తాజాగా తన కోస్టార్ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేతో కలిసి గురువారం ఉదయం హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్లో సందడి చేశారు విజయ్. రౌడీని చూసిన వెంటనే అక్కడున్న అభిమానులు లైగర్, లైగర్ అంటూ నినాదాలు చేశారు. ఫ్యాన్స్ తనపై చూపిస్తున్న ప్రేమకు విజయ్ ఫిదా కాగా… రౌడీ హీరోకు ఉన్న క్రేజ్ చూసి అనన్య ఆశ్చర్యపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అనంతరం అభిమానులతో కలిసి లైగర్ సినిమా వీక్షించారు విజయ్, అనన్య. మరోవైపు దేశవ్యాప్తంగా లైగర్ సినిమా థియేటర్లలో ఫ్యాన్స్ సందడి మాములుగా లేదు. భారీ కటౌట్స్, పాలాభిషేకాలు అంటూ రచ్చ చేస్తున్నారు. లైగర్ సినిమా కోసం బాక్సార్ గా కనిపించేందుకు దాదాపు రెండేళ్లు విజయ్ శిక్షణ తీసుకుని తన బాడీని పూర్తిగా మార్చుకున్నాడు. అంతేకాకుండా నత్తితో మాట్లాడేందుకు చాలా కష్టపడినట్లు లైగర్ ప్రమోషనల్లో చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించాడు. తల్లి ఆశయం కోసం పోరాడే కొడుకు పాత్రలో కనిపించి మెప్పించాడు విజయ్.