ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేమానురాగాలను చాటిచెప్పే 'ది క్రైమ్'

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 03, 2019, 10:04 PM

టీనేజ్ వయసులో పిల్లలతో తల్లితండ్రుల అనుబంధం సరిగా లేకపోతే ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో అని చెప్పిన లఘు చిత్రం 'ది క్రైమ్'. సమకాలీన యాంత్రిక జీవనంలో తల్లిదండ్రులు, పిల్లల మధ్య తరిగిపోతున్న రిలేషన్స్, ప్రేమానురాగాల ప్రాముఖ్యతను చాటిచెప్పిందీ  ఇండిపెండెట్ ఫిలిం. ప్రముఖ నటుడు, దర్శకుడు, మాటల రచయిత తనికెళ్ల భరణి, సింధు, అంజలి, యుగ్ రామ్ నటించిన ఈ షార్ట్ ఫిలింకు ప్రేక్షకుల నుంచి విశేషంగా ప్రశంసలు లభించాయి. ఈ చిత్రానికి ప్రశాంత్ వల్లూర్  దర్శకత్వం వహించగా, రమేష్ నాయుడు నిర్మించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ప్రీమియర్‌కు చిత్ర యూనిట్‌తో ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్, నటుడు వంశీ చాగంటి ,టీఎన్ఆర్ తదితరులు హాజరయ్యారు. 
నిర్మాత రమేష్ నాయుడు మాట్లాడుతూ.. "ప్రశాంత్ కాన్సెప్ట్ చెప్పినప్పుడే నాకు నచ్చింది. ఓ మంచి సందేశాన్ని ప్రజలకు చేరవేయాలనుకొన్నాం. సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని తనికెళ్ల భరణి గారితో  చెప్పిస్తే బాగుంటుందని అనుకొని సంప్రదించాం. కాన్సెప్ట్ వినగానే ఆయన కూడా ఇంప్రెస్ అయి నటించడానికి ఆసక్తిచూపారు.  ప్రతీ ఒక్కరు చూసి ఈ వీడియోను షేర్ చేయాలని కోరుకొంటున్నాం "అని అన్నారు.
దర్శకుడు ప్రశాంత్ వల్లూర్  మాట్లాడుతూ... "సమాజంలోని సమస్యను తీసుకొని ది క్రైమ్ మూవీని రూపొందించాం. మీరు ఈ లఘు చిత్రాన్ని చూసి అలా వదిలేయకండి. మీ కుటుంబంలో ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకొనేలా జాగ్రత్త తీసుకోండి. మీ చుట్టు ఉన్న వారికి, స్నేహితులు, సన్నిహితులకు ఈ సందేశాన్ని చేరవేయండి. ఇలాంటి సందేశాలు సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. పిల్లలు, తల్లిదండ్రుల బంధాల మధ్య దూరం పెరుగుతున్న పరిస్థితుల్లో ఇలాంటి సందేశం ఉపయోగంగా ఉంటుంది. షార్ట్ ఫిలిం అయినప్పటికీ.. ఓ సినిమా లాంటి ఫీలింగ్ రావడానికి కృష్టి  చేసిన యూనిట్‌లోని ప్రతీ ఒక్కరికి నా థ్యాంక్స్" అని అన్నారు.
నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. "సమాజంలో ప్రతీ ఇంట్లో ఉండే సమస్యను ఎత్తిచూపుతూ మూవీని రూపొందించడం అభినందనీయం. తల్లిదండ్రులు గానీ, పిల్లలు గానీ, లవర్స్ మధ్య ఉండాల్సిన సున్నితమైన బంధాల గురించి చక్కగా తెరకెక్కించారు. నేను అమితంగా అభిమానించే నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణి నటించడం, యూనిట్‌ను ప్రోత్సహించడం అభినందనీయం. ఈ సినిమా అందరిలో ధైర్యాన్ని పెంపొందిస్తుంది '' అని అన్నారు.
తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. "ఓ మంచి ఆలోచనకు తెరరూపం కల్పించడానికి కారణమైన ప్రశాంత్ భార్యను అభినందించాలి. తెలుగు సాహిత్యంలో మహా రచయిత గుడిపాటి వెంకటాచలం  'విలువ శిక్షణ' అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ముందుమాట రాస్తూ.. ఇలాంటి పుస్తకం 50 ఏళ్ల క్రితం దొరికి ఉంటే నా పిల్లలను మరింత మంచిగా, విలువలతో పెంచేవాడిని అని చెప్పారు. ద్వందార్థాలతో, బూతు కంటెంట్‌తో షార్ట్ ఫిలింస్ వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి మంచి సందేశంతో సినిమా రావడం గొప్ప విషయం. కష్టపడి, ఇష్టంగా పనిచేసి నటించాం. అంజలి, సింధు చక్కగా నటించారు '' అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa