ఉదయనిధి స్థాలిన్ సనాతన ధర్మంపై చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతూ.. పెద్ద కాంట్రవర్సీగా మారాయి. ఇప్పుడు సనాతన ధర్మంలోని లోపాలను ఎత్తి చూపేదిగా చిత్రం నిర్మిస్తున్నట్లు చిత్ర హీరో, నిర్మాత జేమ్స్ కార్తీక్ వెల్లడించారు. నెట్కో స్టూడియోస్ బ్యానరుపై కార్తీక్, నియాజ్ వెంచర్స్ సమర్పణలో జేమ్స్ కార్తీక్ నిర్మించిన చిత్రం ‘సీరన్’. దురై కె.మురుగన్ దర్శకుడు. ఇందులో జేమ్స్ కార్తీక్‌తో పాటు ఇనియా, సోనియా అగర్వాల్, అజీద్, క్రిష్ కురూప్, నరేన్, అరుంధతి నాయర్, సెండ్రాయన్ తదితరులు నటించగా.. అరవింద్ జెరాల్డ్, శశిధరన్ సంగీతం అందించారు. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌ను తాజాగా చెన్నైలో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు.ఇందులో హీరో కమ్ నిర్మాత జేమ్స్ కార్తీక్ మాట్లాడుతూ.. ‘నేటి సమాజంలో మన కళ్ళ ముందు జరిగే అనేక వాస్తవిక సంఘటనలు ఇందులో ఉన్నాయి. నా నిజ జీవిత కథే. ఇందులో మా అమ్మ పాత్రను ఇనియ పోషించారు. షెడ్యూల్డ్ కులానికి చెందిన నేను చదువుకునే రోజుల్లో జరిగిన అనేక వాస్తవాలను ఇందులో చూపించాం. ఒక్కమాటలో చెప్పాలంటే సనాతన ధర్మంలోని లోపాలను ఎత్తిచూపాం. సినిమా విడుదలైన తర్వాత ఆటంకాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.