69వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఇటీవల ఢిల్లీలో జరిగిన సంగతి తెలిసిందే. పలు విభాగాల్లో తెలుగు సినీ ప్రముఖులు పురస్కారాలు దక్కించుకున్నారు. ఉత్తమ నటుడిగా ‘పుష్ప ది రైజ్’ చిత్రానికి గానూ అల్లు అర్జున్, ఉత్తమ యాక్షన్ డైరెక్టర్‌గా కింగ్ సాలమన (ఆర్‌ఆర్‌ఆర్), ఉత్తమ డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా ప్రేమరక్షిత్ (ఆర్‌ఆర్‌ఆర్), ఉత్తమ గీత రచనకు చంద్రబోస్ (కొండపొలం), ఉత్తమ నేపథ్య గాయకుడిగా కాలభైరవ (ఆర్‌ఆర్‌ఆర్), ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం గా ‘ఆర్‌ఆర్‌ఆర్’కు గానూ రాజమౌళి, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప), ఉత్తమ నేపథ్య సంగిత దర్శకుడిగా కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్), ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌కి శ్రీనివాస మోహన్ (ఆర్‌ఆర్‌ఆర్) అవార్డులు అందుకున్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి పలువురు అవార్డు అందుకున్న నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ పార్టీ ఇచ్చింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు టాలీవుడ్ దర్శక నిర్మాతలు సందడి చేశారు. ఇది తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించాల్సిన విషయమని ట్వీట్‌లో మైత్రీ సంస్థ పేర్కొంది.