విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం ‘లియో’. ఈ సినిమా మొదలైనప్పటి నుంచీ ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంది. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా... కొందరు నెగటివ్ పబ్లిసిటీ చేశారు. తాజాగా చెన్నైలో గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేదికపై విజయ్ మాట్లాడుతూ...... నాకోసం ప్రాణమిచ్చే అభిమానులున్నారు. మీప్రేమను ఎలా తిరిగివ్వాలో నాకు తెలియడం లేదు. మీరంతా నా గుండెల్లో ఉన్నారు. నా దృష్టిలో మీ అందరి హృదయాలు దేవాలయాలు. ఏదీ ఆశించకుండా మీరు చూపించే ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అందరికీ కృతజ్ఞతలు అని అన్నారు.అలాగే ‘లియో’లో మొదటిపాట ‘నా రెడీ..’ విషయంలో పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే! దీనిపై విజయ్ మాట్లాడుతూ ‘‘ఆ పాట లిరిక్స్‌లో ‘చేతి వేళ్ల మధ్యలో టార్చ్..’ అనే లైన్ ఉంటుంది. దానిని సిగరెట్ అనే ఎందుకు అనుకోవాలి. ఓ పెన్ను అని కూడా అనుకోవచ్చు కదా? ఇలా నేను జవాబివ్వాలనుకుంటే ఎన్నో విషయాలున్నాయి. కానీ, నేను అన్నింటి గురించి మాట్లాడాలనుకోవడం లేదు. సినిమాను సినిమాలానే చూడాలన్నది నా కోరిక. అది కేవలం వినోదం కోసం మాత్రమే. ఏదైనా విషయంలో మంచి-చెడు రెండూ ఉంటాయి. మంచిని మాత్రమే తీసుకోవాలి’’ అన్నారు. సూపర్‌స్టార్ కాంట్రవర్సీ గురించి మాట్లాడుతూ ‘‘తమిళంలో ఒక్కరే తలైవర్ ఆయన ఎంజీ రామచంద్రన్, ఒక్కరే నడిగర్ తిలగం ఆయనే శివాజీ గణేశన్, ఒక్కరే సూపర్‌స్టార్ ఆయనే రజనీకాంత్. ఒక్కరే ఉలగనాయగన్ ఆయనే కమల్ హాసన్, తాలా అజిత్ ఒక్కరే, ఇక నేను దళపతిని. దళపతి అంటే రాజు ఆదేశాన్ని పాటించేవాడు అని అర్థం. అభిమానులంతా నా రాజులు. నేను మీ సేవకుడిని అని వివరించారు.