అక్కినేని నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ ‘దూత’ డిసెంబర్ ఒకటిన ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించిన విక్రమ్ కె కుమార్ బుధవారం మీడియాతో సిరీస్ విశేషాలు పంచుకున్నారు. ‘13 బి’ తర్వాత నేను సూపర్ నేచురల్ జోనర్‌లో సినిమాలు చేయలేదు. వెబ్ నుంచి ఇలాంటి అవకాశం వచ్చిన నేపథ్యంలో లాంగర్ ఫార్మెట్‌లో ఇలాంటి జానర్‌లో చేయాలనుకున్నాను. ‘దూత’ గురించి నాగచైతన్యకు చెప్పాను. ఆయనకు చాలా నచ్చింది. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. చాలా మలుపులు ఉంటాయి. కథతో పాటు ప్రేక్షకుడిని చివరి వరకూ తీసుకెళ్లాలి. అది పెద్ద సవాల్. ఈ సిరీస్‌పై ప్రేక్షకుల స్పందన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.దూత అంటే మెసెంజర్. ఒక సంఘటనని ప్రజల వద్దకు చేరవేసే జర్నలిస్ట్ కూడా దూతే. ఇది ఒక జర్నలిస్ట్ నేపథ్యంలో జరుగుతుంది. ‘దూత’ ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. స్ర్కీన్‌ప్లే రాసుకున్నప్పుడు మాత్రం వెబ్ సిరీస్‌ను దృష్టిలో పెట్టుకున్నాను. దూత ఆలోచనకు ఎనిమిది ఎపిసోడ్స్‌ని హోల్డ్ చేసే బలం ఉంది. ‘దూత’ దాదాపు 240 దేశాల్లో ప్రసారం కానుంది. ఇది సూపర్ నాచురల్ థ్రిల్లర్ కనుక ఇలాంటి జానర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. మన షోని వాళ్లు కూడా ఎంజాయ్ చేయడం మంచి అనుభూతి.‘దూత’ కి ముందు నాగచైతన్య ‘థాంక్ యూ’ సినిమా చేశారు. అందులో గడ్డం ఉంటుంది. నాకు చైతుని గడ్డంలో చూడడం ఇష్టం. అయితే కొత్తగా ప్రయత్నిద్దామని ‘దూత’లో ఆయనకి క్లీన్ షేవ్ చేశాం. చాలా అద్భుతంగా కనిపిస్తారు ఇందులో.షూటింగ్ త్వరగానే పూర్తి చేశాం కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ సమయం తీసుకుంది. ప్రేక్షకుడిని కూర్చో పెట్టాలంటే టెక్నికల్ వర్క్ చాలా బ్రిలియంట్‌గా ఉండాలి. ఎడిటింగ్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. నవీన్ అద్భుతంగా ఎడిట్ చేశారు. అలాగే మ్యూజిక్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నాం అని అన్నారు.