బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా తీరు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఏ విషయాన్ని అయినా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది. తాజాగా ఆమె.. ‘రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్’ సినిమా హిందీ ట్రైలర్ విడుదల కార్యక్రమానికి గెస్ట్‌గా హాజరయ్యారు. బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, అనసూయ కీలక పాత్రల్లో నటించిన బహు భాషా చిత్రం ‘రజాకార్’. యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ‘‘రక్తంతో తడిసిన చరిత్ర మట్టిలో కలిసిపోయింది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబరు 17 కథా వస్తువుగా, ఆనాడు జరిగిన విముక్తి పోరాటం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇది మత ఘర్షణ కాదు. స్వాతంత్య్ర పోరాటం’’ అని దర్శకుడు చెప్పారు. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ట్రైలర్ విడుదల అనంతరం కంగనా రనౌత మీడియాతో మాట్లాడారు. మీరు ప్రధానమంత్రి కావాలని ఎప్పుడైనా అనుకున్నారా?’ అని విలేకరి అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించారు రంగనా. తను నటించిన చిత్రంపైనే ఆమె కామెంట్ చేవారు. ‘‘ఇటీవల నేను ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో నటించా. త్వరలోనే విడుదల కానుంది. అది చూశాక ఎవరూ నేను పీఎం కావాలని కోరుకోరు’’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు. ఈమధ్య కాలంలో కంగనా తీరుని బట్టి ఆమె రాజకీయాల్లోకి వస్తారని భావించారంతా. ఈ మేరకు పలు ఇంటర్వ్యూల్లో ఆమె ప్రశ్నించగా ఆమె సానుకూలంగా స్పందించారు. ‘భగవాన్ శ్రీకృష్ణుడి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా పోరాడుతా’ అని పాలిటిక్స్ ఎంట్రీపై ఓ సందర్భంలో ఆమె హింట్ ఇచ్చారు. భారతదేశ మొదటి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఇందులో ఇందిరా గాంధీ పాత్ర పోషించడమే కాకుండా దర్శకనిర్మాతగా కూడా వ్యవహరించింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా జూన్ 14న విడుదల కానుంది.