బెల్లంకొండ శ్రీనివాస్ ఓ అరుదైన రికార్డ్‌ను సాధించాడు. అది అలాంటి ఇలాంటి ఘనత కాదు దేశంలోనే..కాదు కాదు మొత్తం ప్రపంచంలోనే ఇంతవరకు ఏ హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో ఏ హీరోకు, ఏ సినిమాకు సాధ్యం కానీ, సాధ్య పడని రికార్డును నెలకొల్పి ఔరా అనిపించి తెలుగోడి సినిమా పవర్‌ను మరోమారు ప్రపంచానికి వెలుగెత్తి చాటాడు. తను నటించిన జయ జానకీ నాయక చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది చూసిన సినిమాగా రికార్డులకెక్కింది. ఈ మేరకు బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పెన్ మూవీస్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తండ్రి బెల్లంకొండ సురేష్ వారసుడిగా 2014లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన చేసింది పది సినిమాలే అయినప్పటికీ ఆయన పని చేసిన దర్శకులు, హీరోయిన్ల కాంబినేషన్ల వల్ల మంచి గుర్తింపే పొందాడు. కేరీర్ ఆరంభంలోనే వీవీ వినాయక్ , బోయపాటి శీను, తేజ, శ్రీవాస్ వంటి దర్శకులు, సమంత, పూజా హెగ్డే, కాజల్ ఆగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, అనుపమ పరమేశ్వరన్ వంటి టాప్ హీరోయన్లతో పాటు నభా నటేశ్, అను ఇమ్మూన్యుయేల్, మెహరీన్ వంటి నవతరం నాయికలతో సినిమాలు చేసి తనకంటూ అభిమానులను సంపాదించుకోగలిగాడు. శ్రీనివాస్ ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు పూర్తవగా ఆయన చేసిన సినిమాలు పది మాత్రమే. వీటిలో మంచి విజయం సాధించిన సినిమాలు రెండు, మూడే ఉన్నప్పటికీ ఆయన సినిమాలు హిందీలోకి డబ్ చేసి యూ ట్యూబ్ లో విడుదల చేయగా కనివినీ ఎరుగని రీతిలో వ్యూస్ సాధించి శ్రీనివాస్‌కు బాలీవుడ్‌లోనూ గుర్తింపు తీసుకువచ్చాయి. ఈ క్రమంలో శ్రీనివాస్ నటించిన అన్ని సినిమాలను డబ్ చేయగా అవి కూడా అంతే స్థాయిలో ఫలితాలు తీసుకువచ్చి మన దేశంలో ఇప్పటివరకు ఏ నటుడికి సాధ్యం కానీ విధంగా 100 మిలియన్లకు తగ్గకుండా వ్యూస్ దక్కించుకున్నాయి. దీంతో చత్రపతి సినిమాతో డైరెక్ట్‌గా హిందీలో డెబ్యూ చేశాడంటే ఆయనకు హిందీ ప్రేక్షకుల్లో ఎలాంటి ఆదరణ ఉందో ఇట్టే అర్థమవుతుంది.అయితే ఇప్పుడు ఈక్రమంలోనే ఆయన బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి నటించిన జయజానకీ నాయక సినిమా 2017లో రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదలై యావరేజ్ హిట్‌గా నిలిచింది. తర్వాత ఈ చిత్రాన్ని హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్ లో పెట్టగా కొద్దికాలంలోనే 100 మిలియన్ల వ్యూస్ రాబట్టి సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడీ సినిమా 800 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ప్రపంచ వ్యాప్తంగా సినిమాల చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఏ హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలకు, హీరోలకు కూడా సాధ్యమవని ఈ ఫీట్‌ను ఓ తెలుగు సినిమా చిన్న హీరో సాధించడం విశేషం. ఈ సినిమా తర్వాత 772 మిలియన్ల వ్యూస్‌తో కేజీఎఫ్ పార్ట్1 ఉంది. ఇదిలాఉండగా బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా తేజ దర్శకత్వంలో వచ్చిన సీత సినిమా తెలుగులో డిజాస్టర్‌గా నిలవగా హిందీలో యూట్యూబ్‌లో 642 మిలియన్ల వ్యూస్ సాధించడం గమనార్హం.