ఆహా స్టూడియో, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా భారతరత్న పురస్కార గ్రహీత, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవిత ప్రస్థానాన్ని బయోపిక్ రూపంలో తెరమీదకు తీసుకురావడానికి సిద్ధమయ్యాయి. ఈ ప్రతిష్ఠాత్మక బయోపిక్‌ను ‘హాఫ్ లయన్’ పేరిట వెబ్ సిరీస్‌గా రూపొందిస్తున్నారు. ప్రముఖ రచయిత వినయ్ సీతాపతి రచించిన ‘హాఫ్ లయన్ ’ పుస్తకం ఆధారంగా జాతీయ అవార్డు గ్రహీత, నటుడు ప్రకాష్ ఝా ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియన్ సిరీస్ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ సిరీస్‌ను విడుదల చేయబోతున్నారు. పీవీ నరసింహారావు జీవితంలోని కీలక మైలురాళ్లను ఈ సిరీస్ హైలైట్ చేయనుంది. 1991 నుంచి 1996 వరకు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన భారతదేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చి కొత్తపుంతలు తొక్కించటంలో ఎలా సఫలీకృతుడయ్యాడో ఇందులో చూపించనున్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవమైన పీవీ నరసింహారావుకు ‘భారతరత్న’ అవార్డును ప్రకటించిన శుభ తరుణంలో ఈ వెబ్ సిరీస్ ప్రకటన అందరిలోనూ అసక్తిని పెంచింది.