విశ్వనాయకుడు కమల్ హాసన్ మల్టీటాలెంటెడ్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత, గీత రచయిత.. ఇలా ఆయనలో ఉన్న ప్రతిభ లెన్నో. ఆయన కూతురు శ్రుతి హాసన్ కూడా అంతే. నటి, గేయ రచయిత, గాయని, సంగీత దర్శకురాలు. ఇటీవల ఓ ప్రైవేట్ ఆల్బమ్ కోసం రాసిన ఇంగ్లిష్ పాటని తండ్రి కమలహాసన్ తమిళంలో అనువదించాడు. ‘ఇనిమేల్’ పేరుతో రూపొందిన ఈ ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్ ఇటీవల విడుదలై విశేష ఆదరణ పొందింది. నెటిజన్లు సైతం ఆ ఆల్బమ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ సందర్భంగా ఆమె ఫ్యాన్స్ తో చిట్‌చాట్ చేసింది. కాసేపు క్షేమ సమాచారాలు మాట్లాడాక.. ఓ నెటిజన్ మీ తండ్రి కమల్‌హాసన్ బయోపిక్‌ని మీరు తీస్తారా? అని ప్రశ్నించారు. దానికి ఆ అవకాశమే లేదని బదులిచ్చింది శ్రుతీ. " నా తండ్రి జీవిత చరిత్రని సినిమాగా తీయలంటే ఎంతో అవగాహన, గట్స్ ఉండాలి. దానికి నేను సరైన వ్యక్తి కాదు’ అని పేర్కొంది శ్రుతీ. ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు ఉన్నారు. వారైతే అద్భుతంగా నాన్న జీవితాన్ని తెరకెక్కించగలరు' అని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది. గతేడాది 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి', 'సలార్' చిత్రాలతో హ్యాట్రిక్ విజయం అందుకున్న ఆమె ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగులో 'డెకాయిట్', 'సలార్ -2', తమిళంలో 'చెన్నై స్టోరీ' చిత్రాలు చేస్తోంది.