ప్రముఖ హాలీవుడ్ నిర్మాణసంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో 'ముఫాసా: ది లయన్ కింగ్' ఒకటి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ విడుదలైంది. ఇందులో కీలకమైన 'ముఫాసా' పాత్రకు మహేశ్‌బాబు డబ్బింగ్ చెప్పారు. ''అప్పుడప్పుడు ఈ చల్లని గాలి.. నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నట్టు అనిపిస్తుంది. అంతలోనే అవి మాయమవుతున్నాయి'' అంటూ మహేశ్ చెప్పే సంభాషణలు సినీప్రియులను ఆకట్టుకునేలా ఉన్నాయి. అద్భుతమైన విజువల్స్‌తో మహేశ్ డైలాగ్స్‌తో ట్రైలర్ ఆద్యంతం అలరించేలా సాగింది.
'ముఫాసా'కు వాయిస్ ఓవర్ అందించడంపై మహేశ్ ఆనందం వ్యక్తంచేశారు. ''మనకు తెలిసిన, ఇష్టపడే పాత్రకు కొత్త అంకం. తెలుగులో 'ముఫాసా'కు వాయిస్‌ని అందించినందుకు చాలా సంతోషిస్తున్నా. ఈ క్లాసిక్‌కి నేను విపరీతమైన అభిమానిని కావడంతో ఇది నాకెంతో ప్రత్యేకంగా ఉంది'' అని తెలిపారు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రపంచవ్యప్తంగా విడుదల కానుంది. మరోవైపు, ఈ సినిమా హిందీ వెర్షన్‌లో ముఫాసా పాత్రకు షారుక్ ఖాన్, ముఫాసా చిన్నప్పటి పాత్రకు ఆయన తనయుడు అబ్రం వాయిస్ ఓవర్ అందించారు. ''ముఫాసాకు అద్భుతమైన వారసత్వం ఉంది. అడవికి అతడే రారాజుగా నిలుస్తాడు. ఒక తండ్రిగా ఆ పాత్ర నా మనసుకు చేరువైంది. బాల్యం నుంచి రాజుగా ఎదగడం వరకూ ముఫాసా జీవితం ఎలా సాగిందనే విషయాన్ని ఈ సినిమా తెలియజేస్తుంది. 2019లో వచ్చిన 'ది లయన్ కింగ్' తర్వాత మరోసారి ఈ పాత్ర కోసం వర్క్ చేయడం ప్రత్యేకంగా ఉంది. మరీ ముఖ్యంగా నా పిల్లలతో కలిసి వర్క్ చేయడం ఆనందంగా అనిపిస్తుంది'' అని షారుక్ తెలిపారు. ఇందులోని సింబా పాత్రకు షారుక్ పెద్ద తనయుడు ఆర్యన్ ఖాన్ స్వరాన్ని అందించడం విశేషం.