బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 18 ఏళ్లు పూర్తి కావొస్తుంది. రెగ్యులర్ కథలకు భిన్నంగా, తనకంటూ ఒక శైలిని ఏర్పాటు చేసుకుని విభిన్నమైన కథా చిత్రాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ . పలు కారణాలతో వాయిదాల తర్వాత సెప్టెంబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన వరుస ఇంటర్వ్యూల్లో ఆమె.. తన కెరీర్‌ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కెరీర్ బిగినింగ్ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు ‘‘నటిని కావాలనే ఆశతో 2004లో ముంబయి వచ్చా. 2005-06లో ‘గ్యాంగ్‌స్టర్’, ‘వో లమ్హే’ వంటి చిత్రాల్లో నటించా. డ్రగ్స్‌కు అలవాటు పడిన సూపర్ మోడల్, గ్యాంగ్‌స్టర్ వంటి ఎన్నో పాత్రలు పోషించా. నా నటనకు ప్రశంసలు దక్కాయి. పొగడ్తలు పక్కన పెడితే దాదాపు దశాబ్దకాలం పాటు నాకు వర్క్ దొరకలేదు. ఆఫర్స్ లేక ఇబ్బందులు ఎదుర్కొన్నా. దేశమే నన్ను బహిష్కరించిందనిపించింది. విదేశాలకు వెళ్లిపోవాలనుకున్నా’’ అని అన్నారు. నటి, దర్శకురాలు ఏ వర్క్ చేయడం కష్టంగా అనిపించింది? అని ఓ ప్రశ్నించగా.. ‘‘నటిగా వర్క్ చేయడం నాకు ఏమాత్రం కష్టం కాదు. అది నాకు చాలా సులభమైన పని. కానీ, నటిగానే కొనసాగడం నాకు నచ్చదు. ఎందుకంటే దానికి పలు కారణాలున్నాయి. సెట్‌కు సంబంధించి పూర్తి సమాచారం మన వద్ద ఉండదు. దర్శకురాలిగా ఉండటం నాకెంతో ఇష్టం. సెట్‌లో ఏం జరుగుతుంది? అని అడిగితే తప్పకుండా నేను చెప్పగలను. నాకు పూర్తి అవగాహన ఉంటుంది. నటీనటులుగా ఉండటం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో తెలిసిన మంచి దర్శకుల్లో నేనూ ఒకదాన్ని అనుకుంటున్నా. సెట్స్‌లో నాకు నటీనటులంటేనే ఎక్కువ గౌరవం. వారిని జాగ్రత్తగా చూసుకుంటా. ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విషయాలు వారికి తెలియజేస్తా’’ అని కంగన రనౌత్ చెప్పారు.