తమిళ చలన చిత్ర పరిశ్రమలో ఎవరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా ధైౖర్యంగా ముందుకొచ్చి చెప్పాలని, దానిపై సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ (నడిగర్ సంఘం) తగిన చర్యలు తీసుకుంటుందని హీరో, అసోషియేషన్ జనరల్ సెక్రటరీ విశాల్ అన్నారు. తమ దృష్టిలో మహిళలు పురుషులు సమానమన్నారు. జరిగిన అన్యాయాలపై గొంతెత్తి మాట్లాడితే అవకాశాలు రావేమోనన్న ఆలోచన వద్దని విజ్ఞప్తి చేశారు. తమిళ నటుల రక్షణకు ఇటీవల ఓ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. నటి రోహిణి ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశాల్ మాట్లాడుతూ ‘‘ఒకరు ధైౖర్యంగా తమకు ఎదురైన సమస్యల గురించి మాట్లాడితే మరొకరు ముందుకొచ్చి మాట్లాడగలుగుతారు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాం. తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులు గురించి చాలామంది ఎన్నో ఏళ్ల తర్వాత మాట్లాడుతున్నారు’’ అని అన్నారు. మహిళ రక్షణ గురించి బాలీవుడ్‌లో ప్రస్తావన లేదేంటి? అనే ప్రశ్నకు విశాల్ సమాధానమిస్తూ.. ‘‘అది ఆ చిత్ర పరిశ్రమలో పని చేసే మహిళలపై ఆధారపడి ఉంది. ఒకవేళ ఎవరైనా వేధింపులకు గురై ఉంటే నిజాన్ని బయటపెట్టేందుకు ఇదే సరైన సమయం’’ అని పేర్కొన్నారు. నడిగర్ సంఘంలో సభ్యత్వం లేని వారు కూడా తమ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని సీనియర్ యాక్టర్, కొత్త నటుడు, దర్శకుడు, నిర్మాత, డిస్ర్టిబ్యూటర్.. ఇలా ఎవరిపైనైనా ఫిర్యాదు వేస్త తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని విశాల్ తెలిపారు.