‘దేవర’ దర్శకుడు కొరటాల శివపై మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘దేవర’. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ. కె నిర్మించిన ఈ మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజైంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ వెర్సటైల్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నట్లుగా మేకర్స్ పోస్టర్స్ విడుదల చేస్తున్నారు. అంతేకాదు, 80 శాతానికి పైగా రికవరీ అయినట్లుగా కూడా ప్రకటించారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనూహ్యంగా రద్దు కావడంతో.. సక్సెస్ మీట్ అయినా గ్రాండ్‌గా జరుపుతారేమోనని అభిమానులు ఆశపడ్డారు. సక్సెస్ మీట్ ఏమోగానీ.. మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ని మాత్రం గ్రాండ్‌ని నిర్వహించారు. ఆ సెలబ్రేషన్స్‌లో దర్శకుడు కొరటాల శివపై ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సక్సెస్ పార్టీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) మాట్లాడుతూ.. ‘‘కొరటాల శివతో ‘బృందావనం’ మూవీ నుంచి నా ప్రయాణం మొదలైంది. కొరటాల శివ మా కుటుంబ సభ్యుడిగా మారారు. ‘దేవర 2’ చిత్రీకరణ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నాకు, కళ్యాణ్ రామ్ అన్నయ్యకు హరికృష్ణ కొసరాజు వెన్నెముకలాంటి వారు. అతని వల్లే ఎన్టీఆర్ ఆర్ట్స్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది’’ అని అన్నట్లుగా తెలుస్తోంది.