కోలీవుడ్ ఫిల్మ్ లబ్బర్ పాండు తమిళనాడులో సెన్సేషన్ సృష్టిస్తుంది. హరీష్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మరో ఐదు తమిళ చిత్రాలతో పాటు విడుదలైంది. భారీ పోటీ ఉన్నప్పటికీ లబ్బర్ పాండు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మూడో వారాంతంలో సినిమాకు తమిళనాడులో 450 స్క్రీన్లను కేటాయించారు. ఇప్పటి వరకు ఈ సినిమా దాదాపు తమిళనాడు బాక్సాఫీస్ వద్ద 25 కోట్లు వసూలు చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రం కేవలం 250 స్క్రీన్లలో మాత్రమే విడుదలైంది. అద్భుతమైన స్పందన కారణంగా అన్ని ప్రాంతాలలో ప్రదర్శనను పెంచారు. తమిళరాసన్ పచ్చముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా. ఈ చిత్రంలో దినేష్ అట్టకత్తి మరియు స్వాసిక ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఇటీవలి ఇంటర్వ్యూలో, నిర్మాత లక్ష్మణ్ ఈ చిత్రం ప్రారంభ టైటిల్ “జపాన్” అని వెల్లడించారు. లక్ష్మణ్ మాట్లాడుతూ... క్రికెట్ బేస్డ్ స్క్రిప్ట్‌తో దర్శకుడు మొదట్లో నన్ను సంప్రదించారు. ఈ చిత్రానికి జపాన్ అని పేరు పెట్టాలనుకున్నాడు. ఆ టైటిల్ వినగానే ఎగ్జైట్ అయ్యాను. జపాన్ క్వాలిటీకి పేరుగాంచింది. సినిమాలోని కథానాయకుడు నాణ్యమైన క్రికెట్ షాట్‌లకు పేరుగాంచాడు. హీరోకి 40 ఏళ్లు ఓ కూతురు కూడా ఉంది. క్రికెట్‌లో కథానాయకుడి శత్రువైన వ్యక్తితో ఆమె ప్రేమలో పడుతుంది. నన్ను స్క్రిప్ట్‌లోకి లాగిన విధానం అద్భుతంగా ఉంది అని అన్నారు. అంతేకాకుండా కథాంశం నన్ను బాగా ఆకట్టుకుంది. నేను వెంటనే ఆమోదముద్ర వేసి స్క్రిప్ట్ డెవలప్ చేయమని దర్శకుడికి చెప్పాను. 'జపాన్' టైటిల్ హక్కులు దర్శకుడి స్నేహితుడి సంస్థ వద్ద ఉన్నాయి. కానీ వారు దానిని పునరుద్ధరించడం మర్చిపోయారు. ఆ సమయానికి, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఇప్పటికే హక్కులను కొనుగోలు చేసింది మరియు వారు ఆ టైటిల్‌ను కార్తీ మరియు రాజు మురుగన్ చిత్రానికి ఉపయోగించారు. అందుకే డిఫరెంట్ టైటిల్ పెట్టాల్సి వచ్చింది అని అన్నారు.