నటి మనీషా కొయిరాలా తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్యాన్సర్ చికిత్స రోజులను గుర్తుచేసుకున్నారు. చికిత్స తీసుకొనే సమయంలో తను అనుభవించిన నొప్పిని, భరించలేని బాధను వివరించారు. వైద్యంతో పాటు.. తన తల్లి ప్రోత్సాహం, ఆమె ఇచ్చిన ధైర్యం వల్లే ఆ మహమ్మారి నుంచి బయటపడినట్లు తెలిపారు. 2012లో మనీషా అండాశయ క్యాన్సర్ బారినపడ్డారు. మూడేళ్ల చికిత్స అనంతరం 2015లో ఆమె క్యాన్సర్‌ను జయించారు. ఈవిషయంపై ఆమె మాట్లాడుతూ.. ‘క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్న రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. అప్పుడు భరించలేని బాధ, నొప్పిని అనుభవించాను. అవే నాకు చివరి రోజులనుకున్నా. ఎలాంటి లక్షణాలు లేకుండా చివరిదశలో ఉన్నప్పుడు ఈ మహమ్మారి నాలో ఉందని తెలిసింది. మొదట అందరిలాగే భయపడ్డాను. చనిపోతాననుకున్నా. న్యూయార్క్‌లో ఉన్న గొప్ప వైద్యులు నాకు చికిత్స అందించారు. ఆరు నెలలు అక్కడే ఉన్నాను. 11 గంటలు ఆపరేషన్ చేశారు. కీమో థెరపీ గురించి నా కుటుంబానికి కూడా వైద్యులు వివరించారు. వైద్యం కొనసాగుతున్న సమయంలో అమ్మ నాకోసం ఎన్నో పూజలు చేసింది. మహా మృత్యుంజయ హోమాలు జరిపించింది. ‘మనీషా, నీకు ఏం కాదు.. ధైర్యంగా ఉండు’ అంటూ అమ్మ నిరంతరం నన్ను ప్రోత్సహించేది. ఆమె ఇచ్చిన ధైర్యంతోనే నేను ఆ మహమ్మారిని జయించాను. ఈ జీవితం నాకు దేవుడిచ్చిన రెండో అవకాశం’ అని మనీషా ఆ రోజులను గుర్తుచేసుకున్నారు.
క్యాన్సర్‌ను జయించిన అనంతరం మనీషా తన జీవిత చరిత్ర పుస్తకం రాసిన విషయం తెలిసిందే. 2018లో తన జీవిత చరిత్ర ‘‘హీల్డ్: హౌ క్యాన్సర్ గేవ్ మీ ఏ న్యూ లైఫ్’’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. క్యాన్సర్ నుంచి ఎలా బయటపడ్డారు, అందుకోసం ఏం చేశారనే సమాచారాన్ని అందులో పొందుపరిచారు. మనీషా ప్రస్తుతం వరుస వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి’ వెబ్ సిరీస్‌లో మల్లికాజాన్‌గా తన నటనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారమవుతోంది. త్వరలోనే ఈ వెబ్‌సిరీస్ రెండో భాగం ప్రారంభం కానుంది.