సూర్య కథానాయకుడిగా శివ దర్శకత్వంలో రూపొందిన కంగువా' ఈ వారమే థియేటర్లకు వచ్చింది. భారీ బడ్జెట్ తో... భారీ తారాగణంతో ఈ సినిమాను నిర్మించారు. సూర్య ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో, కథానాయికగా దిశా పటాని మెరిసింది. కోలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, ఆ అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది.'కంగువా'లో సూర్య లుక్ అందరిలో ఆసక్తి పెరగడానికి కారణమైంది. అయితే సూర్య మోడ్రన్ లుక్ తో కూడిన పాత్రతో కథ మొదలు కావడం .. ఆ పాత్ర ఇంట్రడక్షన్ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. ఇక ఈ సినిమాలో ఆటవిక తెగల మధ్య పోరాటం, విదేశీయులు ఆశపెట్టిన బంగారు నాణాల కారణంగా మొదలవుతుంది. కొన్ని వందల ఏళ్ల క్రితం బంగారు నాణాలపై అసలు అవగాహనే లేని ఆటవీకులు, వాటి కోసం ఆశపడే అవకాశమే ఉండకపోవచ్చు. 'కంగువా' తన జాతి కోసం పోరాడటం సరైనదిగానే కనిపిస్తుంది. కానీ 'కంగువా' ఒక తల్లికి మాట ఇచ్చానని చెప్పి, ఆమె కొడుకు కోసం తన గూడెంను కూడా వదిలేసి ఆ పిల్లాడి వెంట చీకటికోనకి వెళ్లడంతో కథ పక్కదారి పడుతుంది. ఇక 'కంగువా' ఒక తెగకి నాయకుడు... తిరుగులేని యుద్ధవీరుడు. కానీ ఆ గూడెం వాళ్లెవరూ ఆయన మాటను వినిపించుకోరు. ఆయనకి తగులుతాయనే స్పృహ కూడా లేకుండా రాళ్లు విసరడం అందుకు ఒక ఉదాహరణ. ఆ పాత్ర ఔన్నత్యం దెబ్బతినడం ఇక్కడ తెలుస్తుంది. ఇక ప్రధానమైన పాత్రలు కూడబలుక్కున్నట్టుగా పునర్జన్మను పొందడం అన్నిటికి మించిన హైలైటు!