టెక్నాలజీ మనకు సాయం చేయాలని గానీ, దానితో జీవితాలు నాశనం చేయకూడదని హీరోయిన్ ప్రజ్ఞా నగ్రా ఆవేదన వ్యక్తం చేశారు. ‘లగ్గం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆమెపై ఎవరో సృష్టించిన ఓ ఫేక్ వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయింది. అంతేకాదు, ఎక్స్ వేదికగానూ ఆమె పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ క్రమంలో ప్రజ్ఞా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది.‘‘అది ఎప్పటికీ నిజం కాదు. ఇదంతా ఓ పీడ కల అయితే బాగుండనిపిస్తోంది. టెక్నాలజీ మనకు సాయం చేయాలి. కానీ, మన జీవితాల్ని నాశనం చేయకూడదు. దుర్మార్గమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో ఓ చెత్త వీడియో సృష్టించి, దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వరుసగా వస్తున్న ఆలోచనల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా. ఇలాంటి క్లిష్ట సమయాల్లో నాకు అండగా నిలిచిన వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాలాగా మరో ఏ అమ్మాయికి జరగకూడదని ప్రార్థిస్తున్నా. ఇలాంటి వాటి విషయంలో దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి’’ అని ఎక్స్ వేదికగా స్పందించింది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ, సైబరాబాద్ పోలీస్, సైబర్ దోస్త్, మహారాష్ట్ర సైబర్ పోలీసులను ట్యాగ్ చేసింది.
హరియాణాలోని అంబాలకు చెందిన ప్రజ్ఞా మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. మోడల్‌గా 100కు పైగా వివిధ ప్రకటనలు చేసింది. 2022లో జీవా కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం ‘వరలారు ముక్కియం’తో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత N4, నథికళిల్ సుందరి యుమనా (మలయాళం) చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన తెలుగు చిత్రం ‘లగ్గం’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాయి రోనక్ కథానాయకుడు. రమేశ్ చెప్పాల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కుటుంబ కథా చిత్రంగా రూపొందింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీల్లో (lagaan ott platform) ‘లగ్గం’ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.