ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప2: ది రూల్' బ్లాక్‌బస్టర్ టాక్‌తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఏకంగా రూ. 621 కోట్లు కొల్లగొట్టినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ చిత్రానికి టికెట్ ధరలు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించడంతో ధరలు భారీగా పెరిగిపోయి చాలామంది సినిమా చూడటానికి వెనుకాడారు. అలాంటి వారికి ఇవాళ్టి నుంచి 'పుష్ప-2' టికెట్ ధరలు తగ్గనుండడం అనేది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. తెలంగాణ సర్కార్ ఈ మూవీ కోసం తేదీల వారీగా శ్లాబ్‌ల రూపంలో టికెట్ ధరలు పెంచుకోవడానికి వీలు కల్పించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ. 105, మల్టీప్లెక్స్‌లో రూ. 150 పెంపునకు ప్రభుత్వం అనుమతి నిచ్చింది.
కానీ, నైజాం ఏరియాలో పెంచిన ధరతో పోలిస్తే టికెట్ ధరలు ఇంకాస్త తగ్గినట్లు ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షో చూపిస్తోంది. సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర రూ. 200 (జీఎస్‌టీ అదనం)గా ఉండగా... మల్టీప్లెక్స్‌లో రూ. 395 (జీఎస్‌టీ అదనం)గా ఉంది. దీని ప్రకారం చూస్తే సింగిల్ స్క్రీన్లతో పాటు మల్టీప్లెక్స్‌లోనూ అనుమతి తీసుకున్న మేరకు టికెట్ ధరను పెంచలేదని తెలుస్తోంది. అలాగే విజయవాడలోనూ సింగిల్ స్క్రీన్‌లో రూ. 220గా ఉంటే... మల్టీప్లెక్స్‌లో రూ. 300 మాత్రమే ఉంది. అటు విశాఖలో సింగిల్ స్క్రీన్‌లో రూ. 295 ఉండగా, మల్టీప్లెక్స్‌లో రూ. 300-377 వరకూ ఉన్నట్లు బుక్‌మై షో చూపిస్తోంది.