మంచు ఫ్యామిలీలో మళ్లీ విభేదాలు రచ్చకెక్కినట్లు సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తున్నాయి. ఆస్తుల పంపకానికి సంబంధించి మోహన్ బాబు, మంచు మనోజ్ ల మధ్య గొడవ జరిగిందని, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.ఆ తర్వాత పరస్పరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారని ఆదివారం ఉదయం నుంచి పుకార్లు షికార్లు చేశాయి. అయితే మోహన్ బాబు పీఆర్ స్పందించి ఇవన్నీ అబద్ధాలు అని అందులో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఎలాంటి ఆధారాలు లేకుండా అవాస్తవాలు ప్రచార చేయవద్దని సూచించింది. అయితే సాయంత్రానికే మంచు మనోజ్ నడవలేని స్థితిలో ఆస్పత్రిలో జాయిన్ కావడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరలయ్యాయి. దీంతో మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అంతు పట్టడం లేదు. ఇదిలా ఉండగానే మోహన్ బాబు ఓ ఎమోషనల్ ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు. అయితే అది ఈ గొడవలకు సంబంధించిన విషయం కాదు. తన కెరీర్ కు సంబంధించింది. 1979లో తాను నటించిన కోరికలే గుర్రాలైతే ను గుర్తుకు చేసుకున్నారు మోహన్ బాబు. ఈ చిత్రంలో ఆయన యమధర్మరాజు పాత్రలో కనిపించారు. ఈ లోని సన్నివేశాలు తనకు జీవితాంతం గుర్తుండిపోతాయంటూ ఎమోషనల్ అయ్యారు.
'నా గురువు, లెజెండరీ శ్రీ దాసరి నారాయణరావు గారు, నిర్మాత శ్రీ జి జగదీష్ చంద్ర ప్రసాద్ ఆధ్వర్వంలో వచ్చిన ఈ సన్నివేశం నా కెరీర్‌లో ఓ ప్రత్యేక మైలురాయిగా నిలిచిపోతుంది. చంద్రమోహన్, మురళీ మోహన్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. ఇది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తొలిసారిగా యమ ధర్మరాజు పాత్ర చేయడం మరచిపోలేని అనుభూతి. ఈ సన్నివేశం ఒక సవాలు మాత్రమే కాదు.. ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ చిత్రం నా సినీ ప్రయాణంలో ఒక ప్రత్యేకతగా నిలిచింది.' అంటూ పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఓ వీడియోను కూడా షేర్ చేశారు. మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయనే వస్తున్న నేపథ్యంలో మోహన్ బాబు ఈ పోస్ట్ పెట్టడంతో అది కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.