తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తరచూ సోషల్‌మీడియా వేదికగా షేర్ చేస్తుంటారు నటుడు రామ్‌చరణ్ సతీమణి ఉపాసన .తాజాగా ఆమె సనాతన ధర్మాన్ని ఉద్దేశించి ఎక్స్ (ట్విటర్) వేదికగా పోస్ట్ పెట్టారు. గౌరవ, మర్యాదలతో ఇతరులకు వైద్యం అందించడమే నిజమైన సనాతన ధర్మమని తన తాతయ్య చెప్పినట్లు ఆమె తెలిపారు.''అవసరమైన వారికి సానుభూతి, గౌరవంతో వైద్యాన్ని అందించడమే మాకు నిజమైన సనాతన ధర్మం అని తాతయ్య నేర్పించారు. ఆయన మాటల నుంచి స్ఫూర్తి పొందిన మేము.. అయోధ్య రామ మందిరం వద్ద అపోలో ఉచిత ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ప్రారంభించాం. తిరుమల, శ్రీశైలం, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లలో విజయవంతంగా ఈ సెంటర్లు ఏర్పాటు చేశాం. ఇప్పుడు రామ జన్మభూమిలో దీనిని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ విషయంలో మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు'' అని పేర్కొన్నారు. శనివారం ఈ సెంటర్లను ప్రారంభించినట్లు తెలుస్తోంది.