తన మేనమామ, నటుడు చిరంజీవి ని అల్లు అర్జున్ కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం చిరంజీవి నివాసానికి బన్నీ వెళ్లారు.చిరు కుటుంబంతో సుమారు గంటపాటు సమయం గడిపారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి చిరంజీవిని బన్నీ కలుసుకున్నారు. తాజా పరిణామాలపై వీరు చర్చించుకున్నట్లు సమాచారం.'పుష్ప 2' బెనిఫిట్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో శుక్రవారం ఉదయం పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ రాత్రంతా ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో శనివారం ఉదయం విడుదలయ్యారు. ఆ తర్వాత చిరంజీవి సతీమణి సురేఖ బన్నీ నివాసానికి వెళ్లి భావోద్వేగానికి గురయ్యారు. ''అర్జున్ అరెస్ట్ అయ్యాడని తెలియగానే ఎంతో కంగారు పడ్డాం. ఆయన (చిరంజీవి) కూడా నిన్న షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చేశారు'' అని సురేఖ చెప్పారు.బన్నీ అరెస్ట్ అయిన రోజున చిరంజీవి, సురేఖ దంపతులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకొని కుటుంబసభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే.