కోలీవుడ్ వారు ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ ను పరిచయం చేయడానికి ఆసక్తిని చూపుతుంటారు. అందువలన అక్కడ హీరోయిన్స్ మధ్య గట్టి పోటీ ఉంటుంది. హీరోయిన్ నచ్చితే చాలు అక్కడి వారు అభిమానం చూపించే విధానం నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. అలా అక్కడివారితో మంచి మార్కులు వేయించుకున్న కథానాయికగా 'ఇవాన' కనిపిస్తుంది. టీనేజ్ లోనే మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఇవాన, ఆ తరువాత హీరోయిన్ గా యూత్ హృదయాల్లోకి అడుగుపెట్టింది. 'ఇవాన అందంలో ఏదో ఆకర్షణ ఉంది... ఆమె నవ్వులో సమ్మోహితులను చేసే ఏదో మంత్రం ఉంది' అంటూ అక్కడి పత్రికలు ఆమెను గురించి రాశాయి. ఆమె విశాలమైన కళ్లు ఎటు తిప్పుతూ ఉంటే కుర్రాళ్లంతా అటు తిరిగిపోయారు. ఆమె అభిమానుల జాబితాలో పొలోమంటూ చేరిపోయారు. ఇక 'లవ్ టుడే' సినిమాతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రేమకథలకు ఆమె కేరాఫ్ అడ్రెస్ గా మారిపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఆ తరువాత చేసిన సినిమాలు ఆ స్థాయిలో ఆడలేదు. 'లవ్ టుడే' సినిమా తెలుగులో కూడా మంచి వసూళ్లను రాబట్టడంతో, టాలీవుడ్ దృష్టి ఈ బ్యూటీ పై పడింది. ఆశిష్ రెడ్డి హీరోగా ఆమె 'సెల్ఫిష్' సినిమాతో పరిచయం కావలసి ఉంది. కానీ ఆ తరువాత ఆ సినిమా సంగతి ఏమైందో తెలియదు. సాధారణంగా తమిళంలో ఒక కొత్త హీరోయిన్ వచ్చిందంటే, తెలుగులోను వాళ్లకి వెంటనే అవకాశాలు వస్తూ ఉంటాయి. మరి ఇవాన ఎందుకని ఇక్కడి వరకూ రాలేకపోతుందా అనేది ఇక్కడి అభిమానులను వేధిస్తున్న పెద్ద ప్రశ్న.
![]() |
![]() |