G.V. ప్రకాష్ ' మంచి సంగీత దర్శకుడు. హీరోగానూ సినిమాలు చేశాడు. గాయకుడు కూడా. ఇప్పుడు నిర్మాతగా మారాడు. తన కెరీర్‌లో హీరోగా 25వ సినిమా చేస్తూ, ఆ చిత్ర నిర్మాణంలో భాగమయ్యాడు. ఈ సినిమా ప్రచారం విషయంలోనూ చాలా కేర్ తీసుకొన్నాడు. 25వ సినిమా కదా, మైల్ స్టోన్ మూవీలా మిగిలిపోవాలని ఆశ పడ్డాడు. సముద్రంలో జాంబీలు అనే పాయింట్ ఇప్పటి వరకూ ఇండియన్ స్క్రీన్ పై రాలేదు. కాబట్టి జీవీ ఏదో మ్యాజిక్ చేస్తాడన్న నమ్మకం కుదిరింది. మరి ఈ సినిమా ఎలా వుంది అనేది చూదాం..
తమిళనాడులోని సముద్ర తీరంలోని తుట్టుకూడి అనే గ్రామం. అక్కడ వరుస మరణాలు ఆ గ్రామాన్ని వణికిస్తాయి. స్టీఫెన్ బోస్ (అళగన్ పెరుమాళ్) అనే ఒక్కడి అత్యాస వల్లే ఈ మరణాలని ఊరి ప్రజలు భావించి పెరుమాళ్‌ని కొట్టి చంపేస్తారు. ఆ కోపంతో అతని ఆత్మ ఆ ఊరిని పట్టి పీడిస్తోందని వాళ్ల భయం. పెరుమాళ్ సమాధి ఊరిలో ఉంటే, ఊరు బాగుపడదని సముద్రంలోనే సమాధి చేయాల్సివస్తుంది. అప్పటి నుంచి ఆ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లాలంటేనే భయం పుట్టుకొస్తుంది. 43 ఏళ్లు ఊరి ప్రజలు చేపల వేటకు వెళ్లరు. వాళ్లంతా సాల్మాన్ (చేతన్) దగ్గరే పని చేస్తుంటారు. మార్టిన్ ఊరి ప్రజలకు పెద్ద దిక్కు. అతని దగ్గర నమ్మకస్తుడు కింగ్ (జీవీ ప్రకాష్ కుమార్). కింగ్‌కి డబ్బంటే పిచ్చి. అందుకోసం ఏమైనా చేస్తాడు. కాకపోతే.. దాన్ని ఆసరాగా తీసుకొని సాల్మాన్ చేపల వేట పేరుతో స్మగ్లింగ్ చేయిస్తుంటాడు. ఆ కారణంలోనే కింగ్ ని నమ్ముకొచ్చిన ఓ కుర్రాడు అకారణంగా చనిపోవాల్సివస్తుంది. దాంతో సాల్మాన్‌తో గొడవ పెట్టుకొంటాడు కింగ్. అంతేకాదు… సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదన్నది కట్టు కథ అని, సముద్రంలోకి వెళ్లి చేపల్ని వేటాడి పట్టుకొస్తానని శపథం పూనతాడు. అందుకే ఊరి ప్రజల నమ్మకాన్ని ధిక్కరించి సముద్రంలో వేటకు వెళ్తాడు. వెళ్లిన తరవాత అక్కడ ఏం జరిగింది? సముద్రంలో ఏముంది? ఊరి ప్రజల నమ్మకాలు నిజమేనా? ఇదంతా తెరపై చూసి తెలుసుకోవాల్సిన సంగతి. ప్రేక్షకుల్ని థ్రిల్ కి గురి చేసేంత కంటెంట్ ఈ కథలో వుంది. కానీ దాన్ని తెరపై సజావుగా తీసుకురాలేకపోయాడు. సముద్ర గర్భంలో బంగారం ఎలా దొరికింది? ఆ నిధి ఎవరిది? అనేది మరో కథ. దాని గురించి ఏమాత్రం ప్రస్తావించలేదు. బహుశా.. ఈ సినిమా హిట్టయితే సీక్వెల్ ప్లాన్ చేద్దురేమో..? అందుకోసం ఆ కథని మాత్రం పెద్దగా టచ్ చేయలేదు.
ఈ సినిమాలోని పాటలు అంతగా క్లిక్ అవ్వలేదు. బహుశా.. డబ్బింగ్ వెర్షన్‌కి పాటలు సరిగా కుదర్లేదేమో? తొలి పాట అయితే ఇంకా ఇబ్బంది పెడుతుంది. నేపథ్య సంగీతంలో మాత్రం జీవీ మార్క్ ఉంటుంది. హారర్ ఎఫెక్ట్స్ లో ఇచ్చిన సౌండ్స్ భయపెడతాయి. సముద్రంలో తెరకెక్కించిన సన్నివేశాలు బాగా వచ్చాయి. ఈ బడ్జెట్ లో, ఇలాంటి క్వాలిటీ మేకింగ్ చూపించడం కష్టమే. ఈ విషయంలో టెక్నికల్ డిపార్ట్మెంట్ బాగా కష్టపడింది. డబ్బింగ్ క్వాలిటీ సరిగా లేదు. కొన్ని చోట్ల తమిళ బోర్డులు యధావిధిగా వదిలేశారు. కథ, జోనర్ పరంగా కొత్తగా ఉన్న సినిమా ఇది. కాకపోతే.. ప్రేక్షకులకు అర్థమయ్యేలా, థ్రిల్ కలిగించేలా దర్శకుడు చెప్పలేకపోయాడు. అనేక అంశాల్ని ఒకే సినిమాలో చెప్పాలనుకోవడం వల్ల, దేనిపైనా ఫోకస్ చేయలేకపోయాడు.
![]() |
![]() |