అర్జున్ రెడ్డి’, ‘గీతగోవిందం’ చిత్రాలతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఈ యువ హీరో తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. హిట్ పెయిర్‌గా ‘గీతగోవిందం’లో పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించారు. భరత్ కమ్మ దర్శకుడిగా తెరకెక్కించిన తొలి చిత్రమిది. ఓ కాలేజ్ స్టూడెంట్ లీడర్, స్టేట్ లేడీ క్రికెటర్ మధ్య సాగే ప్రయాణమే ఈ చిత్రం. టీజర్, ట్రైలర్‌లో హీరో, హీరోయిన్ మధ్య లవ్ అండ్ ఎమోషన్స్‌ను మాత్రమే చూపించారు.అయితే మంచి మెసేజ్ ఉంటుందని చెప్పారు. మరి ఆ మెసేజ్ ఏంటి? అసలు డియర్ కామ్రేడ్‌కు అర్థమేంటి? ఈ సినిమాను ఏకంగా నాలుగు దక్షిణాది భాషల్లో విడుదల చేశారు. మరి ఇప్పటి వరకు దక్షిణాదిన ఏ స్టార్ హీరో కెరీర్ ప్రారంభంలోనే చేయని ప్రయత్నాన్ని విజయ్ చేశాడు. మరి ఈ ప్రయత్నం ఏ మేర సక్సెస్‌ను సాధించింది. విజయ్ దేవరకొండ, రష్మిక జోడి మరో హిట్‌ను అందుకుందా? లేదా అనే విషయాలు తెలుసుకోవాలంటే ముందు కథేంటో చూద్దాం.
బ్యానర్స్: మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్, నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా, సుహాస్, చారుహాసన్ తదితరులు ,సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, కెమెరా: సుజిత్ సారంగ్, ఎడిటింగ్, డి.ఐ: శ‌్రీజిత్ సారంగ్, డైలాగ్స్: జె కృష్ణ, ఆర్ట్ డైరెక్టర్: రామాంజనేయులు, సాహిత్యం: చైతన్య ప్రసాద్, రహమాన్, కృష్ణకాంత్, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యష్ రంగినేని, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భరత్ కమ్మ, సెన్సార్: యు/ఎ, వ్యవథి: 169.57 నిమిషాలు,
కథ: వైజాగ్‌లో ఉండే చైతన్య అలియాస్ బాబీ(విజయ్ దేవరకొండ) కాలేజ్ స్టూడెంట్ లీడర్. తన కళ్ల ముందు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే రకం కాదు. గొడవల్లో ముందుండే దూకుడు స్వభావాన్ని అతని స్నేహితులు, తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారు. ఓసారి బాబీ వాళ్ల ఎదురింటికి వాళ్ల బంధువు అపర్ణా దేవి అలియాస్ లిల్లీ(రష్మిక మందన్న) వస్తుంది. బాబీ, లిల్లీని ప్రేమిస్తాడు. లిల్లీ స్టేట్ క్రికెట్ ప్లేయర్. చివరకు లిల్లీ కూడా బాబీ ప్రేమకు ఓకే చెబుతుంది. అయితే లిల్లీకి గొడవలంటే భయం. దానికి దూరంగా ఉండమని లిల్లీ చెప్పినా బాబీ వినిపించుకోడు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో బాబీకి దూరంగా లిల్లీ వెళ్లిపోతుంది. దాంతో బాబీ పిచ్చోడైపోతాడు. చివరకు దేశం మొత్తం టూర్ తిరుగుతాడు. సౌండింగ్ థెరపీ మీద రీసెర్చ్ చేస్తూ మూడేళ్లు ఇంటికి దూరంగా ఉంటాడు. బాబీ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఎలాంటి పరిస్థితులను చూస్తాడు? లిల్లీని బాబీ కలిసిన తర్వాత ఆమె మానసిక స్థితేంటి? లిల్లీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది? చివరకు లిల్లీకి జరిగిన అన్యాయంపై బాబీ ఎలాంటి పోరాటం చేస్తాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్: - మెలోడి సాంగ్స్, - హీరో, హీరోయిన్ మధ్య ఉండే కొన్ని లవ్ సీన్స్, మైనస్ పాయింట్స్:- సినిమాలో బలమైన ఇన్‌టెన్స్ లేదు, - దర్శకుడు ఓ బలమైన ఎమోషనల్ పంథాలో కథను ముందుకు తీసుకెళ్లలేకపోయాడు, - స్లో నెరేషన్
విశ్లేషణ: మనం ఇష్టపడే దాని కోసం పోరాటం చేయాలి అనే ఓ పాయింట్‌ను ఆధారంగా చేసుకుని దర్శకుడు భరత్ కమ్మ ఈ సినిమాను తెరకెక్కించాడు. విజయ్ దేవరకొండ కాలేజ్ స్టూడెంట్ యూనియన్ లీడర్ పాత్రలో నటించాడు. ఒకవైపు కోపంగా ఉంటూ పోరాటం చేయడం, మరో పక్క లవర్ బోయ్‌లా ఉండి ఫస్టాఫ్ అంతా మెప్పించాడు. ఇక సెకండాఫ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ కూడా రెండు షేడ్స్‌లోనే నటించాడు. ఈ షేడ్స్ అన్నింటిలోనూ విజయ్ దేవరకొండ తనదైన స్టైల్లో పాత్రకు న్యాయం చేశాడు. ఇక లిల్లీ అనే లేడీ క్రికెటర్ పాత్రలో రష్మిక చక్కగా ఒదిగిపోయింది. ఈ పాత్ర కోసం ఆమె పడ్డ కష్టం తెరపై కనపడుతుంది. సమాజంలో ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఓ సమస్యను ఎదుర్కొన్న బాధితురాలిగా ఆమె నటించింది. ఇక చారుహాసన్, క్రికెట్ చీఫ్ సెలక్టర్ పాత్రధారి, సుహాస్ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతంలో మూడు మెలోడీ సాంగ్స్ మినహా మరేమీ ఆకట్టుకోలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగాలేదు. సుజిత్ సారంగ్ కెమెరా పనితనం బావుంది.
ప్రస్తుతం మహిళా క్రీడాకారులు ఎదుర్కొంటున్నసమస్యలను తెరకెక్కించే ప్రయత్నం చేశారు. అయితే దర్శకుడు భరత్ కమ్మ సినిమా మెయిన్ పాయింట్‌ను బాగానే ఎన్నుకున్నా కథను చెప్పిన విధానం మాత్రం నెమ్మదించింది. అలాగే విజయ్ దేవరకొండ, రష్మిక సినిమా అంటే వీరిద్దరూ గీత గోవిందం తర్వాత కలిసి నటించిన సినిమా కాబట్టి.. భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగినట్లు సినిమా లేదు. హీరో, హీరోయిన్ ఇమేజ్‌ను దర్శకుడు పట్టుకోలేకపోయాడు. ఆ గొడవలేంట్రా బాబూ! అనిపిస్తుంది. ఇక సెకండాప్ ఆరంభంలో హీరో టూర్‌లో తిరుగుతూనే కనపడటం.. సినిమాలో ఎక్కడా కొత్తదనం కనపడదు. స్పీడ్ ఉండదు. చెప్పాల్సిన మెయిన్ పాయింట్ బాగానే ఉన్న దాన్ని తెరకెక్కించడంలో దర్శకుడు పూర్తిగా ఫెయిలయ్యాడని అర్థమవుతుంది. బలమైన ఎమోషన్స్ లేవు. డైలాగ్స్ ఒకట్రెండు మాత్రమే ఉన్నాయి. సినిమాను సాగదీయడం తప్ప చేసిందేమీ తెరపై కనపడలేదు. డియర్ కామ్రేడ్ ... అంచనాలతో వెళితే గల్లంతే. రేటింగ్: 2/5
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa