ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరదాగా సాగిపోయే భార్యాభర్తల కధే 'మందాకిని'

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 30, 2025, 10:25 AM

మలయాళంలో రొమాంటిక్ కామెడీ డ్రామా జోనర్లో నిర్మితమైన సినిమానే 'మందాకిని'. అల్తాఫ్ సలీం - అనార్కలి మారికార్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, వినోద్ లీల దర్శకత్వం వహించాడు. క్రితం ఏడాది మే 24వ తేదీన విడుదలైన ఈ సినిమా, థియేటర్ల నుంచి మంచి వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా నిన్నటి నుంచి 'ఈటీవీ విన్'లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 


కథ: అరవింద్ (అల్తాఫ్ సలీమ్) ఓ మధ్యతరగతి యువకుడు. తండ్రి చనిపోవడంతో, తల్లి డ్రైవింగ్ స్కూల్ నడుపుతూ ఆ కుటుంబాన్ని ఒకదారికి తీసుకుని వస్తుంది. అక్క 'ఆర్తి'కి విష్ణుతో వివాహమవుతుంది. అతనికి గల తాగుడు వ్యసనం వలన ఆమె నానా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. తాను అందగాడిని కాదని అరవింద్ కి తెలుసు, అయినా అందరికి మాదిరిగానే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే ఒక బలమైన కోరిక ఉంటుంది. అందువలన కొంతమంది అమ్మాయిలను ముగ్గులోకి దింపడానికి తనవంతు ప్రయత్నం చేస్తాడు. తనని ప్రేమించే ధైర్యం ఏ అమ్మాయి చేయకపోవడంతో డీలాపడిపోతాడు. ఆ సమయంలోనే అతనికి అమ్ములు (అనార్కలి)తో సంబంధం కుదురుతుంది. అంత అందమైన అమ్మాయి తనని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడం తన అదృష్టంగా భావిస్తాడు. ఆమెతో అందమైన జీవితాన్ని ఊహించుకుంటాడు. అయితే ఫస్టునైట్ వేళ అరవింద్ టెన్షన్ పడుతూ ఉంటే, అతను తాగే జ్యూస్ లో మద్యం కలుపుతాడు విష్ణు. ఆ విషయం తెలియని అనార్కలి, ఆ జ్యూస్ తాగుతుంది. దాంతో ఆమెను మైకం కమ్మేస్తుంది. ఆ సమయంలోనే ఆమె పెళ్లికి ముందువరకూ తనకి .. సుజీత్ వాసుకి మధ్య జరిగిన ప్రేమాయణం గురించి అత్తగారి ముందే చెబుతుంది. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? ఆ తరువాత ఏవౌతుంది? అనేది కథ. విశ్లేషణ: సాధారణంగా కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అనుకుంటారు. అయితే ఆ కూతురు వలన తమ పరువు పోయేలా ఉందనే అనుమానం వచ్చినప్పుడు ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసేయాలని తొందరపడతారు. అలా వాళ్లు తొందరపడి అమ్మాయి పెళ్లి చేసి హమ్మయ్య అనుకుంటే, ఆమె తాను చేసిన పనిని ఫస్టు నైట్ రోజునే అత్తింటివారికి చెబితే ఎలా ఉంటుందనే ఒక అంశం చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఈ కథలో ఆసక్తికరమైన అంశం .. కథను కీలకమైన మలుపు తిప్పే అంశం మద్యం. మగపెళ్లి వారి తరఫున దాదాపు అందరికి మద్యం అలవాటు ఉంటుంది. మద్యం గురించిన విషయాలతోనే కామెడీని వర్కౌట్ చేయడానికి దర్శకుడు ప్రయత్నించాడు. కొంతవరకూ సక్సెస్ అయ్యాడు. అయితే శృతిమించిన మద్యం గొడవల కారణంగా కథ గందరగోళంగా అనిపిస్తుంది. దర్శకుడు ఈ కథను సహజత్వానికి దగ్గరగా తీసుకుని వెళ్లడానికి తనవంతు కృషి చేశాడు. ప్రధానమైన పాత్రలను మలచిన విధానం కూడా సరదాగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ ..క్లైమాక్స్ కూడా కామెడీ టచ్ తోనే ఆకట్టుకుంటాయి. చాలా తక్కువ బడ్జెట్ లో దర్శకుడు ఈ స్థాయి కంటెంట్ ను  రెడీ చేసుకోవడం .. ఈ మాత్రం వినోదాన్ని అందించడం విశేషమే. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa