గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తర కర్ణాటక చిగురుటాకులా వణుకుతోంది. వరదల వల్ల 48 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో 2,738 గ్రామాలు వరదల ప్రభావంతో నష్టపోయాయి. 40, 523 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సహాయక చర్యల్లో అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు నిమగ్నమయ్యాయి. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు సినీ ప్రముఖులు కూడా ముందుకొస్తున్నారు. తెలుగు హీరో సంపూర్ణేష్ బాబు టాలీవుడ్ పరిశ్రమ నుంచి వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చాడు.
ఉత్తర కర్ణాటకలో వరదలు తనను కలిచివేశాయని, కన్నడ ప్రజలు తెలుగు సినిమాను దశాబ్దాలుగా ఆదరిస్తున్నారని సంపూ ట్వీట్ చేశాడు. తనను కూడా హృదయ కాలేయం నుంచి ఎంతగానో ప్రేమిస్తున్నారని, వరదల తాలూకు ఫొటోలు చూసి చాలా బాధేసిందని.. తన వంతుగా 2 లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటిస్తున్నానని సంపూర్ణేష్ బాబు ట్వీట్ చేశాడు. సంపూ గతంలో కూడా తన మానవతను చాటుకున్నాడు. తితలీ తుపానుతో కష్టాల్లో ఉన్న శ్రీకాకుళం జిల్లా వాసులకు రూ.50 వేలు ఆర్థిక సాయం ప్రకటించాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ పేద మహిళకు రూ.10వేల ఆర్థిక సాయం చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa