ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కల్యాణ్ తమకు పెద్దన్న లాంటి వారన్న దిల్ రాజు

cinema |  Suryaa Desk  | Published : Mon, May 26, 2025, 09:05 PM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు, చిత్ర పరిశ్రమలో నెలకొన్న థియేటర్ల బంద్ వంటి పరిణామాలపై ప్రముఖ నిర్మాత, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ  ఛైర్మన్ దిల్ రాజు సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ హర్ట్ అయ్యారని, అందుకు తమను తిట్టే అధికారం ఆయనకు ఉందని, ఆయన తమకు పెద్దన్న లాంటి వారని అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు అంశాలపై నిర్మొహమాటంగా మాట్లాడారు."పవన్ కల్యాణ్‌గారు హర్ట్ అయ్యారు. అందుకు మమ్మల్ని తిట్టే అధికారం ఆయనకు ఉంది. దాదాపు 20 ఏళ్లుగా ఆయన్ని చూస్తున్నాను. ఆయనకు కోపం వచ్చేలా కొన్ని పరిస్థితులు నిజంగానే చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, ఆయన చిత్రాన్నే లక్ష్యంగా చేసుకున్నారంటూ ప్రతికూల ప్రచారం జరిగింది. అయితే, వాస్తవానికి జరిగింది అది కాదు. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అని మీడియాలో హెడ్‌లైన్స్ రావడమే ఈ గందరగోళానికి, ఆయన ఆవేదనకు ప్రధాన సమస్య" అని దిల్ రాజు స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ తమకు పెద్దన్న లాంటి వారని, ఆయన కోప్పడినా, తిట్టినా తాము భరిస్తామని అన్నారు.ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరి ఇన్ని రోజులైనా చిత్ర పరిశ్రమ పెద్దలెవరూ ముఖ్యమంత్రిని కలవలేదని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై దిల్ రాజు స్పందిస్తూ, "ఇక్కడ పెద్దలు ఎవరికి వారే అన్నట్లుగా పరిస్థితి ఉంది. నాకు సమస్య వస్తే నేను పరిగెడతాను. నాగవంశీకి సమస్య ఉంటే ఆయన వెళతారు. మైత్రీ మూవీ మేకర్స్ వారికి ఇబ్బంది ఉంటే వారు ప్రయత్నిస్తారు. నిర్మాతల విషయంలో పరిశ్రమ తరఫున వెళ్లాల్సింది ఛాంబర్. మేం ఎఫ్‌డీసీ ద్వారా ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోరాం, కానీ ఇంకా ఖరారు కాలేదు. నేను ఛాంబర్ ప్రెసిడెంట్ పదవి నుంచి గతేడాది ఎఫ్‌డీసీ ఛైర్మన్ అయ్యాను. కాబట్టి నా దృష్టి అంతా ఇప్పుడు ఎఫ్‌డీసీపైనే ఉంది," అని వివరించారు.జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ నిర్ణయం వెనుక తాను ఉన్నానంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. "ప్రొడ్యూసర్స్‌ సెక్టార్‌ ఛైర్మన్‌ రామ్‌ప్రసాద్‌తో మీటింగ్‌ ఏర్పాటు చేయించింది నేనేనని, జూన్‌ 1 నుంచి థియేటర్ల బంద్‌ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అందులో నిజమెంత? ఏప్రిల్‌ 19న తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఎగ్జిబిటర్ల సమావేశంలో నేను లేను. ఆ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు నా వద్ద ఉన్నాయి. ఆ మీటింగ్‌లో కీలకవ్యక్తి సత్యనారాయణ. ఆయన డిస్ట్రిబ్యూటర్‌, ఎగ్జిబిటర్‌, జనసేన పార్టీలో కూడా కీలక సభ్యుడు" అని దిల్ రాజు తెలిపారు.ఛాంబర్ సరిగా స్పందించకపోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయా అన్న ప్రశ్నకు, "అక్కడ ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు. ఏదైనా విషయం ఉంటే ప్రెస్‌నోట్ విడుదల చేయమని మేం ఛాంబర్‌కు చెబుతూనే ఉంటాం. కానీ, ఛాంబర్‌లోని ఒకరు ఎవరికో ఫోన్‌ చేసి సమావేశం గురించి చెబుతారు, అదే హైలైట్‌ అవుతుంది. అసలు కథ లేకుండా ముగింపు ఒక్కటే చెబితే ఎలా లోపల ఏం జరిగింది? ఈ వ్యవహారం ఎలా మొదలైంది అనే దానిపై స్పష్టత ఉండదు. ఎవరికి వారు భుజాలు తడుముకుంటున్నారు" అని ఆయన అభిప్రాయపడ్డారు.ఫిల్మ్‌ ఛాంబరే సుప్రీం అని, కానీ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ వల్ల నిర్మాతలకు మేలు జరుగుతుందని అల్లు అరవింద్‌ చేసిన వ్యాఖ్యలపై దిల్ రాజు స్పందిస్తూ, "చురుగ్గా సినిమాలు నిర్మించేవారు 10 నుంచి 20 మందే ఉంటారు. వారి సమస్యలు వారికే ప్రత్యేకంగా తెలుస్తాయి. కాబట్టి కౌన్సిల్‌లో మాట్లాడినా, ఛాంబర్‌లో మాట్లాడినా సమస్యలకు తక్షణ పరిష్కారం లభించకపోవచ్చనే ఉద్దేశంతోనే గిల్డ్‌ని ప్రారంభించారు. నిర్మాతలకు సంబంధించిన విషయాలే అక్కడ చర్చిస్తారు" అని అన్నారు. అయితే, ఇండస్ట్రీలోని ఏ విభాగంలోనూ సంపూర్ణ ఏకాభిప్రాయం ఉండదని, అది సహజమని వ్యాఖ్యానించారు.ప్రస్తుతం 90 శాతం సినిమాలు పర్సంటేజ్‌ విధానంలోనే ప్రదర్శితమవుతున్నాయని, పెద్ద సినిమాలను రెంటల్‌ పద్ధతిలోనే ప్రదర్శించాలని, రెండో వారంలో కూడా అదే విధానం కావాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారని తెలిపారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు సామరస్యంగా పరిష్కారమవుతాయని దిల్ రాజు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa